రాహుల్ “బ్యాక్ బెంచర్”కామెంట్ కి సింధియా కౌంటర్..కాంగ్రెస్ లో ఉన్నప్పుడేమైందీ ప్రేమ

రాహుల్ “బ్యాక్ బెంచర్”కామెంట్ కి సింధియా కౌంటర్..కాంగ్రెస్ లో ఉన్నప్పుడేమైందీ ప్రేమ

Scindia బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్​లో ఉంటే ఎప్పటికైనా మధ్యప్రదేశ్​ సీఎం అయ్యేవారని సోమవారం రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింధియా గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్​లో ఉన్నప్పుడు రాహుల్​ ఈ మాటలు అని ఉంటే బాగుండేదని,పరిస్థితి వేరేలా ఉండేదిని సింధియా అన్నారు. తాను దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ పార్టీలో సేవలందించిన సమయంలో రాహుల్‌ తన పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకున్నారని జ్యోతిరాదిత్య సింధియా నిలదీశారు. ఇప్పుడు తన పట్ల ప్రేమ కురిపిస్తున్న రాహుల్‌ అప్పుడు ఎలా వ్యవహరించారో తెలుసునని వ్యాఖ్యానించారు.

కాగా,సోమవారం యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ నుంచి కాషాయ పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీలో ప్రాధాన్యత లేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేసే అవకాశం సింధియాకు ఇచ్చామని, ఆయన ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని తాను అప్పట్లో సింధియాతో అన్నానని రాహుల్‌ గుర్తుచేశారు. కానీ, అందుకు విరుద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు బీజేపీలో చివరి వ్యక్తి(బ్యాక్ బెంచర్) గా సింధియా నిలిచారని వ్యాఖ్యానించారు. కావాలంటే ఇది రాసి పెట్టుకోండి.. సింధియా బీజేపీలో ఉంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు అని రాహుల్‌ అన్నారు. సీఎం కావాలనుకుంటే సింధియా తిరిగి కాంగ్రెస్ లోకి రావాల్సిందేనని రాహుల్ అన్నారు.

ఇక,ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడంలో సింధియా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సింధియాకు కొద్ది నెలల క్రితం రాజ్యసభలో స్థానం కల్పించింది కాషాయపార్టీ.