Sandalwood Cultivation : శ్రీగంధం సాగుతో… అధిక అదాయం

శ్రీగంధం చెట్ల నుండి మంచి దిగుబడి రావాలంటే పశువుల ఎరువు,కంపోస్ట్ , వర్మీకంపోస్ట్ , కుళ్ళిన సేంద్రీయ ఎరువులు అందించాలి. ఒక చెట్టుకు సంవత్సారానికి 10 నుండి 15 కిలోల చివికిన పశువుల ఎరువు అందించాలి.

Sandalwood Cultivation : శ్రీగంధం సాగుతో… అధిక అదాయం

Sandalwood Cultivation

Sandalwood Cultivation : ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు వైపు రైతులు దృష్టిసారిస్తున్నారు. ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషదాలలో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధం మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగరబత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్ లలో ఎంత విరివిగా ఉపయోగిస్తారు. ఈనేపధ్యంలో రైతులు శ్రీగంధం సాగుకు మొగ్గు చూపుతున్నారు. శ్రీగంధం సాగు చేపట్టే రైతులు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

శ్రీ గంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిలువని ఒండ్రు నేలలు, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు. మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి. అనుకూలతలు కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు.

శ్రీ గంధం మొక్కలను సాగుచేసే రైతులు మొక్కల ఎంపిక విషయంలో  జాగ్రత్తలు మెళుకువలను పాటించాల్సి ఉంటుంది. శ్రీ గంధం మొక్కలు నర్సరీలలోనే ఏడు నుంచి ఎనిమిది నెలలపాటు తిరిగి సుమారుగా 35 సెంటి మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కలు ఎంతో అనుకూలం. ఈ విధంగా మంచి గుర్తింపు పొందిన నర్సరీలలో పెరిగిన మొక్కలను ఎంపిక చేసి నాటడం వల్ల రైతులు అధిక లాభాలను పొందవచ్చు.

శ్రీగంధం చెట్టు వేడి, గాలిలో తేమ కలిగిన వాతావరణంలో, వర్షపాతం కలిగిన ప్రాంతాలలో పెరుగుతుంది. సాగు చేపట్టాలనుకుంటే ముందుగా నేలను 2 నుండి 3సార్లు అడ్డంగా, నిలువుగా దున్ని కలుపు లేకుండా చూడాలి. 15 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన చెట్ల నుండి సేకరించిన విత్తనాలను మాత్రమే ఎన్నుకోవాలి. 7 నుండి 8 నెలల వయస్సు కలిగిన 35 సెంటిమీటర్ల ఎత్తు కలిగిన మొక్కలను పొలంలో నాటుకోవాలి. వేసవి కాలంలో ప్రతి 2 వారాలకు ఒక సారి నీరు అందించాలి. బిందు సేధ్యంతో సాగు అనుకూలంగా ఉంటుంది.

శ్రీగంధం చెట్ల నుండి మంచి దిగుబడి రావాలంటే పశువుల ఎరువు,కంపోస్ట్ , వర్మీకంపోస్ట్ , కుళ్ళిన సేంద్రీయ ఎరువులు అందించాలి. ఒక చెట్టుకు సంవత్సారానికి 10 నుండి 15 కిలోల చివికిన పశువుల ఎరువు అందించాలి. ఇలా చేయటం వల్ల చెట్టు త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. పురుగుల, తెగుళ్ళ నివారణకు గాను వేపగింజల కషాయం, గోమూత్రం వంటి వాటిని వినియోగించవచ్చు. జీవశిలీంద్ర క్రిమి నాశనులైన వర్టీసీలియం, సూడోమోనాస్ మొదలైనవి వాడుకోవచ్చు.

శ్రీగంధం చెట్టు 30 సంవత్సరాలకు 25కిలోల వరకు చేవ ఇస్తుంది. ఎకరానికి 250 చెట్లు నాటుకుంటే ఇంచుమించు 6వేల కిలోలకు పైగా దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శ్రీగంధం నాణ్యతను బట్టి 8వేల వరకు పలుకు తుంది. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే పంట కావటం, పెట్టుబడి తక్కువగా ఉండటంతో రైతులు శ్రీగంధం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.