Swiggy పేరిట మోసం : ఫోన్ డెలివరీ చేస్తామని.. రూ. 95 వేలు కాజేశారు

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 12:30 PM IST
Swiggy పేరిట మోసం : ఫోన్ డెలివరీ చేస్తామని.. రూ. 95 వేలు కాజేశారు

ఫుడ్ డెలివరీలో పేరొందిన Swiggy పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ మహిళను మోసం చేసి రూ. 95 వేలు కాజేశారు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఇటీవలే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇటీవలే బెంగళూరులో ఇన్‌స్టంట్ పిక్ అప్ అండ్ డ్రాప్ సర్వీసును లాంచ్ చేసింది. దీనిని క్యాష్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇంద్రానగర్ లో నివాసం ఉండే.. అపర్ణ థాకూర్ తన పాత స్మార్ట్ ఫోన్  OLXలో అమ్మకానికి పెట్టింది. ఆమె ఫోన్ నెంబర్ ద్వారా మహ్మద్ బిలాల్ అనే వ్యక్తి  బాధితురాలిని సంప్రదించాడు. ఫోన్ అందాక డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. తన ఫోన్ ను బిలాల్ కు డెలివరీ చేయడానికి SWIGGY GO AAP ద్వారా ఫోన్ పికింగ్ ఆర్డర్ బుక్ చేసింది. కానీ, తాను ఇచ్చిన అడ్రస్ అసంపూర్తిగా ఉంది. డెలివరీ బోయ్ అడ్రస్ అర్థం కాకపోవడంతో ఆఫీసులోనే ఉంచాడు. చివరికి ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఫోన్ కొనుగోలు చేసిన బిలాల్ అపర్ణకు కాల్ చేసి తనకు ఇంకా ఫోన్ రాలేదని చెప్పాడు.

పికింగ్ ఆర్డర్ చేసిన ఫోన్ ఎందుకు డెలివరీ చేయలేదో తెలుసుకునేందుకు స్విగ్గీ గో యాప్ హెల్ప్ లైన్ నెంబర్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసింది. సైబర్ నేరగాళ్లు ఫేక్ స్విగ్గీ గో హెల్ప్ లైన్ నెంబర్ పేరుతో గూగుల్ పేజీలో పెట్టారు. అది చూసిన బాధితురాలు అదే నెంబర్ కు కాల్ చేసింది. సైబర్ నేరగాళ్లు ఆర్డర్ క్యాన్సిల్ అయిందని, మరోసారి ఆర్డర్ బుక్ చేయాల్సిందిగా కోరారు. ముందుగా ఆర్డర్ కన్ఫర్మేషన్ కోసం ఒక లింక్ పంపిస్తున్నామని నమ్మబలికారు. ఆ లింక్ క్లిక్ చేసి ఆర్డర్ కు రూ.3 ఛార్జ్ చెల్లిస్తే చాలన్నారు. అందులో అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేసింది.

బ్యాంకు ఖాతా నెంబర్, యూపీఐ పిన్ నెంబర్, ఇతరత్రా విషయాలు అందులో ఉన్నాయి. కొద్ది నిమిషాల అనంతరం బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 95 వేలు డ్రా చేసినట్లు అపర్ణ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించింది. తనకు వచ్చిన నెంబర్ కు ఫోన్ చేసింది. కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. కంప్లయింట్ చేసింది.

స్విగ్గీకి చెందిన వారు మోసం చేయలేదని.. ఇతర వ్యక్తులు ఇలా చేశారని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫుడ్ డెలివరీ..ఇతర పేరున్న సంస్థల హెల్ప్ లైన్ పేరిట సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు నంబర్లు ఉంచుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.