జమ్ముకశ్మీర్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్

జమ్ముకశ్మీర్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్

woman to drive a passenger bus in Jammu and Kashmir first time  :  జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఓ మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి అనే మహిళ గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును నడిపారు. బస్సు డ్రైవర్‌ కావాలన్నది తన కోరికని ఈ సందర్భంగా ఆమె మీడియాతో చెప్పారు. దీని కోసం తాను ఎంతో కష్టపడినట్లు పేర్కొన్నారు.

మామ రాజేంద్ర సింగ్‌ నుంచి లారీ నడపడం నేర్చుకున్నట్లు వెల్లడించారు. పేదరికం వల్ల చదువు కొనసాగించలేకపోవడం పట్ల ఆమె బాధను వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన పూజా దేవి మధ్యవయసులో తన కలను నెరవేర్చుకున్నారు. కుమారుడిని వెంటపెట్టుకుని తొలిసారి జమ్ము నుంచి కథువా వరకు ప్రయాణికుల బస్సును నడిపారు.

మరోవైపు పరుషులతో సమానంగా ప్రయాణికుల బస్సు డ్రైవర్‌ వృత్తిని ఎంచుకున్న పూజా దేవిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు పలువురు నేతలు, స్థానికులతోపాటు తోటి డ్రైవర్లు అభినందించారు.