రక్షణ శాఖ కీలక నిర్ణయం : ఆర్మీలోని అన్ని శాఖల్లో మహిళా అధికారిణిలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2019 / 04:11 AM IST
రక్షణ శాఖ కీలక నిర్ణయం : ఆర్మీలోని అన్ని శాఖల్లో మహిళా అధికారిణిలు

ఇండియన్ ఆర్మీలో దీర్ఘకాలం పనిచేయాలనుకునే మహిళా అధికారిణిలకు గుడ్ న్యూస్.  ఇకపై ఇండియన్ ఆర్మీలోని మొత్తం 10 బ్రాంచిల్లో శాశ్మత కమిషన్(PC)లో మహిళా అధికారిణిలు పనిచేయవచ్చు. ఈ మేరకు రక్షణమంత్రిత్వ శాఖ మంగళవారం(మార్చి-5,2019) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం రెండు బ్రాంచిలు.. జడ్జి అడ్వకేట్ జనరల్(JAG), ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ లలో మాత్రమే మహిళా అధికారిణిలు శాశ్వత కమిషన్ లో పనిచేసే అవకాశం ఉండేది. అయితే ఇకపై మిగిలిన ఎనిమిది బ్రాంచిలు..ఇంజినీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఆర్మీ ఎయిర్ ఢిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్,ఇంటిలిజెన్స్ కార్ప్స్ లు మహిళా అధికారిణిల కోసం ఓపెన్ చేసినట్లు రక్షణమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

గతంలో  స్వల్వకాలిక సేవల కమిషన్(SSC) ఎంపిక చేసుకున్నవాళ్లు కూడా శాశ్వత కమిషన్(PC) కు దరఖాస్తు చేసుకుంటే ఆమోదించనున్నారు. ఏ విభాగంలో స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నారో కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. నాలుగేళ్ల శిక్షణకాలం ముగిసేలోపు వీరు తమ అంగీకారం పీసీకి తెలపాల్సి ఉంటుందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఏ మహిళాధికారిణి శాశ్వత కమిషన్ కు తీసుకోవాలనేది ఆర్మీ ఇష్టం. ప్రతిభ, సామర్ధ్యం,తెలివితేలటు ఆధారంగా SSC మహిళా అధికారిణిలు పీసీకి ఎంపిక చేయడం ఉంటుంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ తమ విభాగంలోని అన్ని శాఖల్లోకి మహిళలకు అనుమతిస్తోంది. నేవీలో కూడా మహిళలకు దాదాపు అన్ని విభాగాల్లో అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.