Covid19 Vaccine : పీరియడ్స్‌కు 5 రోజుల ముందు 5 రోజుల తర్వాత కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదా? నిజమెంత?

టీకాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ ప్రచారం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలట. పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత టీకా వేసుకోవద్దని అందులో ఉంది.

Covid19 Vaccine : పీరియడ్స్‌కు 5 రోజుల ముందు 5 రోజుల తర్వాత కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదా? నిజమెంత?

Covid19 Vaccine Menstrual Cycle

Covid19 Vaccine : భారత్ పై కరోనావైరస్ మహమ్మారి దండయాత్ర చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో మరే దేశంలోనే లేని విధంగా భారత్ లో కరోనా కొత్త కేసులు లక్షల సంఖ్యలో బయటపడుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసింది.

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాలు వేయబోతున్నారు. ఇలాంటి సమయంలో టీకాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ ప్రచారం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలట. పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత టీకా వేసుకోవద్దని అందులో ఉంది. ఎందుకంటే.. ఆ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అందుకే టీకా వద్దని అందులో ఉంది. అంతేకాదు పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సందేశం వాట్సాప్ లో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మాయిలు దీన్ని వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. మరి ఇది నిజమేనా? డాక్టర్లు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారం అని తేల్చింది. అంతేకాదు ఇలాంటి పుకార్లని అస్సలు నమ్మొద్దని సూచించింది. 18 ఏళ్లు నిండిన మహిళలంతా ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది రియల్, ఏది ఫేక్ అని తెలుసుకోవడం కష్టంగా మారింది. కొన్ని న్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి. క్షణాల్లోనే ప్రచారం జరిగిపోతోంది. అది నిజమో కాదో తెలుసుకోకుండానే చాలామంది వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఆ తర్వాత ఫేక్ న్యూస్ అని తెలుసుకుని నాలుక కరుచుకుంటున్నారు. అందుకే, సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడి షేర్ చెయ్యడం, ఫార్వర్డ్ చెయ్యడం వంటివి చెయ్యకూడదని చెబుతున్నారు.

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజువారి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 3లక్షల 46వేల 789 కొత్త కేసులు బయటపడ్డాయి. కొత్తగా 2వేల 624మందిని కరోనా రక్కసి బలి తీసుకుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481కి చేరింది. మరణాలు 1,89,544కి చేరింది. మరోవైపు 24గంటల్లో 2లక్షల 19వేల 838మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,38,67,997కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 25,52,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అటు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 13కోట్ల 83లక్షల 79వేల 832మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ కావాలంటే కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.