కలెక్టర్‌‌గా స్కూల్ విద్యార్ధిని.. విషయమేంటంటే!

  • Published By: veegamteam ,Published On : March 3, 2020 / 02:21 PM IST
కలెక్టర్‌‌గా స్కూల్ విద్యార్ధిని.. విషయమేంటంటే!

మహారాష్ట్రలోని ఓ జిల్లాలో స్యూల్ విద్యార్థిని కలెక్టర్‌‌గా ఎంపికయ్యారు. అదేలా అసలు స్కూల్‌ అమ్మాయి కలెక్టర్ అవ్వడమేంటని అనుకుంటున్నారా. విషయమేంటంటే.. ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని ఓ జిల్లా అధికారి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 

అదేంటంటే.. బుల్దానా జిల్లా కలెక్టర్‌ సుమన్‌ రావత్‌ వారం రోజుల పాటు వివిధ పాఠశాలల్లో తెలివైన విద్యార్థినిలకు ఒక్క రోజు కలెక్టర్‌ గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సోమవారం (మార్చి 2, 2020)న జిల్లా పరిషత్‌ పాఠశాల నుంచి పూనమ్‌ దేశ్‌ముఖ్‌ అనే విద్యార్థినిని ఒక్క రోజు కలెక్టర్‌గా ఎంపిక చేశారు. 

కలెక్టర్‌ సుమన్‌ రావత్‌ మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా.. వారం పాటు తెలివైన అమ్మాయిలను ఒక్క రోజు కలెక్టర్‌ గా ఉంచటానికి అవకాశం ఇస్తున్నాం. ఈ రోజు జిల్లా పరిషత్ స్కూల్ నుంచి విద్యార్థిని పూనమ్ దేశ్ ముఖ్‌ను ఎంపిక చేశాం అని ట్విటర్‌ వేదికగా తెలిపారు. 

దీనితో పాటు  విద్యార్థిని కలెక్టర్‌ కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లంతా మీరు సూపర్ మెడమ్ అంటూ కొంతమంది, మీది చాలా మంచి ఆలోచన అని మరికొంతమంది రిప్లైలు ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.