కన్నడ భాషే ముఖ్యం : షా హిందీ వ్యాఖ్యలపై యడియూరప్ప ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : September 16, 2019 / 01:07 PM IST
కన్నడ భాషే ముఖ్యం : షా హిందీ వ్యాఖ్యలపై యడియూరప్ప ఫైర్

సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వివిధ  రాజకీయ పార్టీల నేతలు అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీఎంకే, అన్నాడీఎంకె, జేడీఎస్, కాంగ్రెస్, ఎంఐఎం,ఎమ్ఎన్ఎమ్ తదితర పార్టీలు షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీకి పెద్ద దిక్కు,కర్ణాటక సీఎం యడియూరప్ప  కూడా షా వ్యాఖ్యలను తప్పుబట్టారు.   

మన దేశంలో అధికారిక భాషలన్నీ సమానం. అయితే, కర్ణాటక విషయానికొస్తే కన్నడ ప్రధాన భాష. మేము దాని ప్రాముఖ్యత విషయంలో ఎప్పటికీ రాజీ పడము. కన్నడను ప్రమోట్ చేయడానికి,కర్ణాటక రాష్ట్ర సంస్కృతిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నాము అని యెడియరప్ప ట్వీట్ చేశారు.                       

ఒక దేశం ఒక భాష అంటూ  అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ తీవ్రంగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం(సెప్టెంబర్-16,2019) ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.