హిందుత్వాన్ని వీడను.., నమ్మకద్రోహం చేయలేదు: ఠాక్రే

హిందుత్వాన్ని వీడను.., నమ్మకద్రోహం చేయలేదు: ఠాక్రే

ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఇప్పటికీ తాను హిందుత్వ సిద్ధాంతంతోనే ఉన్నానని, దానిని ఎన్నడూ విడిచిపెట్టబోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌పై ప్రశంసలు కురిపించారు. ఆదివారం నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రతిపక్ష (బీజేపీ) నేతగా ఫడ్నవీస్‌, స్పీకర్‌గా నానా పటోలె ఎన్నికయ్యారు. ఆ తర్వాత శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘ఫడ్నవీస్ నుంచి తానెంతో నేర్చుకున్నానని ఆయనతో స్నేహపూర్వకంగానే ఉంటాను. ఫడ్నవీస్‌ను ప్రతిపక్ష నేతగా సంభోదించను. బాధ్యత గల నేత అని పిలుస్తాను. మీరు మాతో సఖ్యతతో ఉంటే బీజేపీ-శివసేన కూటమి విడిపోయేది కాదు’ అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వానికి తామెన్నడూ నమ్మకద్రోహం చేయలేదని గుర్తు చేశారు. అర్ధరాత్రి నిర్ణయాలు తమ ప్రభుత్వంలో ఉండబోవని స్పష్టం చేశారు. 

అంతకుముందు ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌ పదవికి కిషన్‌ కిశోర్‌ను పోటీకి దించిన బీజేపీ.. ఆదివారం ఉపసంహరించుకుంది. ఫలితంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉభయ సభలనుద్దేశించి ప్రసగించిన గవర్నర్ బీఎస్ కోశ్యారి.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రైవేటు పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా త్వరలో చట్టం చేయబోతున్నట్లు తెలిపారు.