ఆర్టికల్-370 పునరుద్దరించేవరకు ఎన్నికల్లో పోటీ చేయను : మొహబూబా ముఫ్తీ

ఆర్టికల్-370 పునరుద్దరించేవరకు ఎన్నికల్లో పోటీ చేయను : మొహబూబా ముఫ్తీ

Mehbooba Mufti మంగళవారం విడుదలైన జమ్మూకశ్మీర్ స్థానిక ఎన్నికల ఫలితాలు చాలా ఉత్సాహభరింతంగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పీడీపీ అధినేత్రి,మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ అన్నారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు ప్రధాన కశ్మీర్ పార్టీల “గుప్కర్ కూటమి”తరపున సీఎం అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నకు… ఆర్టికల్ 370 పునరుద్దరించేవరకు తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయనని ముఫ్తీ సమాధానమిచ్చారు.

కశ్మీర్ కోసం.. ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలన్నీ “గుప్కర్ కూటమి”గా కలిశాయని.. ప్రస్తుతం ఎన్నికల గురించి మాత్రమే కాకుండా.. కశ్మీర్ కోల్పోయిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొచ్చేందుకు ఈ కూటమి చర్చిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తాము కలిసి కూర్చొని సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై చర్చిస్తామని..అయితే తాను మాత్రం సీఎం రేసులో లేనని ముఫ్తీ క్లారిటీ ఇచ్చారు.

అయితే,గతంలో బీజేపీతో చేతులు కలిపిన తన తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయూద్ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మొహబూబా ముఫ్తీ సమర్థించారు. తన తండ్రి ఓ దెయ్యంతో డీల్ చేశాడని అన్నారు. అయితే తాను కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన మొహబూబా ముఫ్తీ..తాను నరేంద్రమోడీతో చేతులు కలపలేదని..కశ్మీర్ సమస్యల పరిష్కారం కోసం భారతదేశ ప్రధానితో చేతులు కలిపానని అన్నారు. తన తండ్రి హయాంలో,తన హయాంలో కొన్ని షరుతలపైనే తాము బీజేపీతో కూటమిలో చేరామని..అప్పుడు బీజేపీ అన్నింటీకి ఒప్పుకుందని..అయితే ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వాళ్లు చేయాలనుకున్నది వాళ్లు చేశారని మొహబూబా ముఫ్తీ అన్నారు.

కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లో మొత్తం 20 జిల్లాల్లో 280 జిల్లాభివృద్ధి మండలి (DDC)స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. డీడీసీ ఎన్నికల్లో గుప్కర్ కూటమి ఘన విజయం సాధించింది.

మొత్తం 100కి పైగా సీట్ల‌తో గుప్కర్ కూట‌మి స‌త్తా చాటింది. 20 జిల్లాలు ఉన్న జ‌మ్ముక‌శ్మీర్‌లో గుప్కర్ కూట‌మి కాంగ్రెస్ తో కలిసి 13 జిల్లాల్లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. నేషనల్​ కాన్ఫరెన్స్​, పీడీపీ, పీపుల్స్ మూవ్​మెంట్​, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ సహా మొత్తం 7 ప్రధాన పార్టీలు.. ‘పీపుల్స్ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్’​ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మ‌ళ్లీ ఆర్టికల్ 370ని తీసుకురావాల‌ని, ఒకే రాష్ట్రంగా చేయాల‌న్న డిమాండ్‌ తో ఈ కూటమి కొన‌సాగుతోంది.

అయితే, జమ్మూ ప్రాంతంలో మాత్రం బీజేపీ తన సత్తా చూపించింది. జమ్మూ ప్రాంతంలో… 71 సీట్లలో విజయం సాధించి…6 జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ గుప్కర్ కూటమి కేవలం 35 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ 17 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇక కశ్మీర్ ప్రాంతంలో గుప్కర్ కూటమి ఘన విజయం నమోదుచేసింది. కశ్మీర్ ప్రాంతంలో 72 సీట్లలో విజయం సాధించి…9 జిల్లాల్లో గుప్కర్ కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ బీజేపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో 3 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించింది.

గుప్కర్ కూటమి అంటే
ఆగ‌స్ట్-4,2019న శ్రీన‌గ‌ర్‌లో జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీనికి గుప్కర్ డిక్ల‌రేష‌న్ అనే పేరు పెట్టారు. జ‌మ్ముక‌శ్మీర్ అస్తిత్వం, స్వ‌యం ప్ర‌తిప‌త్తి, ప్ర‌త్యేక హోదాను కాపాడుకోవ‌డం కోస‌మే ఈ డిక్ల‌రేష‌న్ చేసిన‌ట్లు ఆ నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే ఈ డిక్ల‌రేష‌న్ త‌ర్వాత 24 గంట‌ల్లోనే భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఉన్న ప్ర‌త్యేక హోదాను తొల‌గించి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ‌జించింది. దీనిని ఈ గుప్కర్ కూట‌మి తీవ్రంగా వ్య‌తిరేకించింది. నిజానికి ఈ గుప్కార్ కూట‌మిలో 45 ఏళ్ల కింద‌ట ఏర్ప‌డిన ప్లెబిసైట్ ఫ్రంట్‌ను చూశారు రాజకీయ విశ్లేష‌కులు. త‌మ ఉనికిని, రాజ‌కీయ భ‌విష్య‌త్తును కాపాడుకోవ‌డం కోస‌మే ఈ కొత్త కూట‌మి అన్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్లెబిసైట్ ఫ్రంట్ ఎలాగైతే ఘ‌న విజ‌యం సాధించిందో.. ఇప్పుడీ గుప్కర్ కూట‌మి కూడా స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది.

గుప్కర్ పేరు ఎలా వ‌చ్చింది?

ఈ డిక్ల‌రేష‌న్‌ను జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో చేశారు. ఈ ఇల్లు గుప్కర్‌లో ఉంది. దీంతో ఈ డిక్ల‌రేష‌న్‌కు గుప్కార్ డిక్ల‌రేష‌న్ అనే పేరు వ‌చ్చింది. ఈ ఇంటిని 1970ల్లో ఫ‌రూక్ అబ్దుల్లా తండ్రి షేక్ మొహ‌మ్మ‌ద్ అబ్దుల్లా కొన్నారు. గోపాద‌రి లేదా గోపా అనే కొండ కింద ఈ ఇల్లు ఉన్న కార‌ణంగా దీనికి గుప్కర్ అనే పేరు వ‌చ్చింది. క‌శ్మీర్‌లో అధికారంలో ఉన్న కుటుంబాలు చాన్నాళ్లుగా ఈ ప్రాంతంలోనే త‌మ నివాసాల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి.