ఇంట్లో ఫ్యామిలీ సేఫ్.. ధైర్యంగా విధుల్లోకి : కరోనా డ్యూటీలో పోలీసుల కోసం 57 హోటళ్లు బుక్ చేసిన ఢిల్లీ

  • Published By: sreehari ,Published On : April 20, 2020 / 07:59 AM IST
ఇంట్లో ఫ్యామిలీ సేఫ్.. ధైర్యంగా విధుల్లోకి : కరోనా డ్యూటీలో పోలీసుల కోసం 57 హోటళ్లు బుక్ చేసిన ఢిల్లీ

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా.. వారి రక్షణ కోసం రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా కొవిడ్-19 డ్యూటీలో పనిచేస్తున్నారు. తమ కుటుంబాన్ని వదిలి దేశ ప్రజల ఆరోగ్యం కోసం అహోరాత్రులు వీధుల్లో పోలీసులు విధులు నిర్వహిస్తూ కష్టపడుతున్నారు.

ఒకవైపు కరోనా భయం వెంటాడుతోంది. అయినప్పటికీ సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. రోజుంతా కొవిడ్-19 ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి ఇళ్లకు వెళ్లితే తమ కుటుంబాలకు వైరస్ ఎక్కడ సోకుతుందోననే భయం పోలీసుల్లో ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు పోలీసులు భయపడాల్సిన అవసరం లేదంటోంది ఢిల్లీ పోలీసు యంత్రాంగం.. ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసుల కోసం ప్రత్యేకించి బస చేసేందుకు 57 హోటళ్లను బుక్ చేసింది. 

దాంతో కొవిడ్-19 డ్యూటీలో ఉండే పోలీసులంతా ఇళ్లల్లో కాకుండా హోటళ్లలోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కరోనాతో భయం లేదని ఊపిరిపీల్చుకుంటున్నారు. పోలీసులంతా ధైర్యంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసు శాఖ కొవిడ్-19 డ్యూటీ చేసే పోలీసులకు దేశ రాజధాని వ్యాప్తంగా 57 హోటళ్లలో బస చేసేలా సౌకర్యాలను కల్పించింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో వారంతా సురక్షితంగానే ఉన్నారనే ధైర్యంగా పోలీసులంతా తమ విధులను సౌకర్యవంతంగా నిర్వహిస్తున్నారు.

పోలీసు సిబ్బంది సంక్షేమ కోసం ప్రొ యాక్టివ్ కింద ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సామాజిక దూరంతో పాటు తమ విధులను కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయం, ఎలాంటి ఆందోళన లేకుండా ధైర్యంగా నిర్వర్తించగలరు’ అని స్పెషల్ కమిషనర్ రాబిన్ హిబు చెప్పారు. ఢిల్లీ పోలీసులు బుక్ చేసిన 57 హోటళ్లలో మొత్తం 1000 గదులను కొవిడ్ పోలీసు సిబ్బంది కోసం బుక్ చేసింది. ఇప్పటివరకూ 442 మంది పోలీసులు హోటళ్లకు షిఫ్ట్ అయ్యారు. 

ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో హోటళ్లు, గెస్ట్ హౌస్‌లను ఎంపిక చేసింది. ఆగ్నేయ ఢిల్లీలో గరిష్టంగా 15 హోటళ్లను బుక్ చేసింది. దీనిద్వారా పోలీసులు విధుల అనంతరం సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుంటుందని భావించింది. మరికొందరు పోలీసులు స్వచ్చంధంగా కొంత చెల్లించి హోటళ్లలో ఉంటున్నారని డీసీపీ (ఆగ్నేయ) ఆర్పీ మీనా తెలిపారు.

ఆగ్నేయ జిల్లాలో మొత్తం 15 హోటళ్లలో ఫ్రెండ్స్ కాలనీలో హోటల్ కరన్ ప్యాలెస్ (22), నెక్ రెసిడెన్సీ (20), కాల్కాజీలో హెరిటేజ్ హోటల్ (20), హోటల్ పార్ల్ ఇన్ (18), అమర్ కాలనీలో షుహుల్ కాంటినెంటల్, ఫ్యాబ్ కాజీ ప్యాలెస్ (10 చొప్పున) గదులను బుక్ చేసింది.