పాకిస్తాన్ తో స్నేహం కొనసాగుతుందన్న ట్రంప్!

  • Published By: venkaiahnaidu ,Published On : February 24, 2020 / 12:41 PM IST
పాకిస్తాన్ తో స్నేహం కొనసాగుతుందన్న ట్రంప్!

రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమందిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. అదిరిపోయే ప్రసంగం చేశారు అమెరికా అధ్యక్షుడు. భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ చాలా గొప్ప వ్యక్తి అని ట్రంప్ అన్నారు. మోడీ ఒక్క గుజరాత్ కే గర్వకారణం కాదని,ప్రపంచానికి మోడీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. 

మోడీ కష్టజీవి అని,భారతీయులు ఏదైనా సాధించగలరు అనడగానికి మోడీ ఓ సజీవ ఉదాహరణ అని అన్నారు. మోడీ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. దేశం కోసం మోడీ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తారన్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోడీ ఒకరన్నారు. ప్రతి ఒక్కరూ మోడీని ప్రేమిస్తారని,కానీ ఆయన చాలా టఫ్ అని ట్రంప్ తెలిపారు. అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందన్నారు. మా గుండెల్లో భారత్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది అని ట్రంప్ అన్నారు. 

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో భారత్-అమెరికాది ఒకే సిద్దాంతమన్నారు. ఏ రూపంలో ఉగ్రవాదాన్ని సహింబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాద ముప్పునుంచి కాపాడేందుకు భారత్ తో కలిసి చర్యలు చేపడుతామన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను ఏరేశామని…ఐసిస్ చీఫ్ బాగ్దాదీని ఇటీవల అమెరికా సైనికులు చంపేశారని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఐసిస్ చీఫ్ మరణం ప్రపంచానికి గొప్ప ఊరట అని ట్రంప్ అన్నారు. సరిహద్దులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు ఉంటుందన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉగ్రవాదాన్ని అరికట్టేలా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చానన్నారు. 

అయితే ఇండియాతోనే కాదు…పాకిస్తాన్ తోనూ ఉగ్రవాద నిర్మూలనలో కలిసి పనిచేస్తామని అహ్మదాబాద్ లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో అమెరికాకు చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆ చనువుతోనే సరిహద్దుల్లో మొన్న భారత్ తో ఉద్రిక్తతలు తగ్గించామని ట్రంప్ తెలిపారు. దీన్ని పరోక్షంగా పాకిస్తాన్ కు తమ మద్దతు ఉందని ట్రంప్ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ గురించి భారత్ గడ్డపై ట్రంప్ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం మాట్లాడకపోవడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ తోనూ ఉగ్రవాద నిర్మూలనకు పాటు పడుతామని ట్రంప్ అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.