ప్రపంచంలోనే ఖరీదైన పంట.. బీహార్‌లో సాగులో ఉంది.. కిలో రూ.లక్ష

ప్రపంచంలోనే ఖరీదైన పంట.. బీహార్‌లో సాగులో ఉంది.. కిలో రూ.లక్ష

వ్యవసాయ ప్రాధాన్యమైన మన భారతదేశంలో ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో తెలియని, వెలుగులోకి రాని, బాగా లాభాలు వచ్చే పంటలు పండుతున్నా కూడా పెద్దగా ప్రాచుర్యం దక్కట్లేదు. వాస్తవానికి నమ్మకం లేక కొందరు కొత్త పంటలు జోలికి వెళ్లరు.. నమ్మకం ఉన్నా కొందరు పెట్టుబడి పెట్టి నష్టపోతే భరించలేమని, సాంప్రదాయ పంటల సాగుకే ప్రాధాన్యం ఇస్తుంటారు.

అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన పంట బీహార్‌లో సాగు అవుతోంది. ఈ పంట ఒక కిలో ధర సుమారు లక్ష రూపాయలు కావడం విశేషం. బీహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ట్రయల్ ప్రాతిపదికన ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కూరగాయల సాగు ‘హాప్-షూట్స్’ సాగిస్తున్నారు. బీహార్‌కు చెందిన అమ్రేశ్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు ఈ సాగు చేస్తుండగా.. అతడు పండించే ప్రత్యేకమైన కూరగాయల ధర పదులు, వందల్లో కాదు.. ఏకంగా వేలల్లో అమ్ముడవుతోంది. కిలో రూ.లక్ష వరకు ధర ఉండే ‘హాప్ షూట్స్’ అనే ఈ కూరగాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.

ఔరంగాబాద్ జిల్లాలోని కరందిహ్ గ్రామానికి చెందిన అతను.. ఇతర ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలను కూడా సాగు చేస్తూ ఉంటాడు. మన దేశంలో హాప్ షూట్స్ పంటను అరుదుగా సాగు చేస్తారు. వీటిని ప్రత్యేక ఆర్డర్లతోనే కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం వీటి సాగు విజయవంతంగా కొనసాగుతోందని అమ్రేశ్ వెల్లడించారు. దీనిని సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే, రైతులకు ఇతర పంటలకంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

హాప్‌ షూట్స్ పూర్తిపేరు హ్యుములస్ లుపులస్. అంతర్జాతీయ మార్కెట్లలో దీని ధర కిలో 1000కు పైగా యూరోల వరకు, మన కరెన్సీలో రూ.లక్ష.. ఈ పంటను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పండిస్తున్నారు. ఈ సంస్థ నుంచి అమ్రేశ్ రెండు నెలల క్రితం హాప్ షూట్స్ కూరగాయల నాట్లు తీసుకొచ్చి సాగు ప్రారంభించారు. బిహార్ వంటి పేద రాష్ట్రాల్లో ఇలాంటి కొత్త పంటల సాగుతో వ్యవసాయ రంగం ఎంతగానో అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుందని, కిలో ధర రూ. లక్ష వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నాడు అమ్రేష్.

ఈ మొక్కలోని అన్ని భాగాలూ విలువైనవే కాగా.. పూలు, పండ్లు, కాండాలను పానీయాలు, బీర్లు, మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్క కాండంతో చేసే మందులకు క్షయ వ్యాధిని నివారించే శక్తి ఉంది. ఈ చెట్టు పూలను బీరు తయారీలో స్టెబిలిటీ ఏజెంట్‌గా వాడతారు. మొక్కల కొమ్మలను ఆహార పదార్థాలు, మెడిసిన్ తయారీకి, యూరోపియన్ దేశాల్లో ఈ కాయలను చర్మ సమస్యల నివారణకు వినియోగిస్తారు. వీటిల్లో ఉండే యాంటీబయాటిక్స్ వయసుతో పాటు వచ్చే వృద్ధాప్యం ప్రభావాన్ని తగ్గిస్తాయి కూడా.