మహారాష్ట్రలో పరిస్థితిపై కేంద్రం ఆందోళన

మహారాష్ట్రలో పరిస్థితిపై కేంద్రం ఆందోళన

Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ ప్రకటన వచ్చిందని దీన్ని బట్టి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని వీకే పాల్ అన్నారు.

గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ..మహారాష్ట్రలో కేసుల పెరుగుదలపై మేము చాలా ఆందోళన చెందుతున్నాం. వైరస్ ను తేలికగా తీసుకోవద్దు. ఊహించని విధంగా అది రాగలదు. మనం మళ్లీ వైరస్ నుంచి విముక్తి పొందాలంటే కోవిడ్- తగిన ప్రవర్తన, నియంత్రణ వ్యూహంతో పాటు వ్యాక్సిన్ లను కూడా వేయాలని పాల్ తెలిపారు. కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న జిల్లాల్లో అర్హులైన వ్యక్తులకు టీకాలు వేయడం మరియు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

కాగా, నాగ్ పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. నాగ్‌పూర్‌లో ఒక్క రోజులోనే 1800 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలో 13,659 పాజిటివ్ కేసులు ఒక్కరోజులోనే నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఇది 60 శాతం. అంతే కాకుండా ఇప్పటికీ మహారాష్ట్రలో లక్షకు పైగా కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రాలోని పది నగరాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయని పేర్కొంది. పూణె, నాగ్‌పూర్, థానె, ముంబై, అమరావతి, జల్గాన్, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఇక, మహారాష్ట్రతో పాటు గుజరాత్, తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని మొత్తం కేసుల్లో ఈ రాష్ట్రాల్లోనే 85 శాతం ఉన్నట్లు తెలిపింది.