మా ఇష్టం : రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత్ సృష్టత

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2019 / 04:59 AM IST
మా ఇష్టం : రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత్ సృష్టత

ర‌ష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల‌పై అమెరికా కొన్ని ఆంక్ష‌లు విధిస్తున్న సమయంలో….భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత వైఖరిని సృష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాష్టింగన్ డీసీలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియోతో స‌మావేశ‌మైన త‌ర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు.

ర‌ష్యా నుంచి మిస్సైళ్ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఎస్‌-400ని కొనుగోలు చేసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఎవ‌రి ద‌గ్గ‌ర ఎటువంటి మిలిట‌రీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామ‌న్న విష‌యంలో క్లారిటీతో ఉన్నామ‌ని, అది మా సార్వ‌భౌమాధికారం అని జైశంక‌ర్ తెలిపారు. మిలిట‌రీ ఆయుధాల‌ను కొనుగోలు చేసే స్వేచ్ఛ త‌మ‌కు ఉన్న‌ద‌న్నారు. దీనిపై తమకు ఏ దేశం అభ్యంతరం చెప్పడాన్ని ఇష్టపడమని అన్నారు.

రష్యా నుండి ఏమి కొనాలి, కొనకూడదో,అమెరికా నుంచే కొనాలి అని ఏ దేశం తమకు చెప్పడాన్ని ఇష్టపడమని జైశంకర్ సృష్టం చేశారు. గతేడాది ర‌ష్యా నుంచి సుమారు 5.2 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో సుమారు ఐదు ఎస్‌-400 క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఆయుధాల్ని కొనుగోలు చేసేందుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకున్న‌ విషయం తెలిసిందే.

2017 చట్టం ప్రకారం…ఉక్రెయిన్, సిరియా దేశాల్లో రష్యా సైనిక ప్రమేయం,యుఎస్ ఎన్నికలలో జోక్యం చేసుకుందన్న ఆరోపణల కారణంగా రష్యా నుండి “ప్రధాన” ఆయుధాల కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. నాటో మిత్రదేశమైన టర్కీ జూన్‌ లో రష్యా నుంచి ఎస్ -400 కొనుగోలు చేసేందుకు రెడీ అవడం అమెరికాకు కోపం తెప్పించింది. ఎఫ్ -35 ఫైటర్ జెట్ కార్యక్రమంలో టర్కీ ప్రమేయాన్ని కట్ చేసిన ట్రంప్..ఇతర ఆంక్షలను ఇంకా ప్రకటించలేదు.