Wrestlers Protest: పోలీసు మద్యం మత్తులో మమ్మల్ని దుర్భాషలాడాడు.. అర్థరాత్రి గొడవపై కన్నీరు పెట్టుకున్న రెజ్లర్లు
జంతర్ మంతర్ వద్ద అర్థరాత్రి ఘటనపై రెజ్లర్లు కన్నీరు పెట్టుకున్నారు. మేము నేరస్తులమా అంటూ ప్రశ్నించారు. ఓ పోలీసు మద్యం మత్తులో మహిళా రెజ్లర్లను దుర్భాషలాడాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Wrestler Sangita Phogat
Wrestlers Protest: జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద అర్థరాత్రి సమయంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) , రెజ్లర్ల (wrestlers) కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీసు మద్యం మత్తులో మహిళా రెజ్లర్ల (Women wrestlers) పై దురుసుగా ప్రవర్తించాడని, దుర్భాషలాడాడని రెజ్లర్లు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ (Wrestler Sangita Phogat) మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు మాతో ప్రవర్తించిన తీరు బాధగా ఉంది. మేం నేరస్తులం కాదు. ఇలాంటి రోజులు చూడటానికా మేము పతకాలు సాధించింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మద్యం మత్తులో ఓ పోలీసు మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంతర్ మంతర్ వద్ద వర్షం కారణంగా మా పరుపులు తడిసిపోయాయని, వాటి స్థానంలో మడత మంచాలను తీసుకొస్తుండగా పోలీసులు అనుమతించలేదని వినేష్ ఫోగట్ చెప్పారు. ఈ సమయంలో పోలీసులు తమ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారని అన్నారు. పోలీసుల తీరుతో ఇద్దరు క్రీడాకారులకు గాయాలయ్యాయని చెప్పారు. మహిళలు ఉన్నచోట మహిళా పోలీసులు లేకపోవటంపై ఫోగట్ ప్రశ్నించారు.
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో నాలుగు పతకాలను గెలుచుకున్నాని, మేము నేరస్తులమా? అని వినేష్ ఫోగట్ కన్నీటి పర్యాంతమయ్యారు. నా పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు. మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి.. ఈ రోజు చూడ్డానికి మేము దేశంకోసం పతకాలు సాధించామా? మేము తిండికూడా తినలేదు. మహిళలను దుర్భాషలాడే హక్కు ప్రతి పురుషుడికి ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. పోలీసులు తుపాకులు పట్టుకున్నారు. వారు మమ్మల్ని చంపగలరు అని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.