మోడీ ప్రారంభించిన….ఆ రైల్వే స్టేషన్ ఆదాయం రోజుకి రూ.20మాత్రమే

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 03:11 AM IST
మోడీ ప్రారంభించిన….ఆ రైల్వే స్టేషన్ ఆదాయం రోజుకి రూ.20మాత్రమే

గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట.  రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్‌కు రైల్వే మార్గాన్ని విస్తరించారు. అన్ని కోట్లు ఖర్చు చేసి రైల్వే లైన్ వేస్తే.. కేవలం 20 రూపాయల ఆదాయం రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుంది అనుకుంటున్నారా..?

 ఒడిశాలోని బలంగిర్ జిల్లాల్లోని బిచ్చుపల్లి రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ ఆదాయ వివరాలు తెలుసుకునేందుకు హేమంత్ పాండా అనే ఓ వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేయగా దానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్టేషన్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే రోజూ ప్రయాణిస్తున్నారని,రూ.20 ఆదాయం వస్తోందని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన సంబల్‌పూర్ డివిజన్ ఇచ్చిన ఆర్టీఐ వివరాల ద్వారా తెలిసింది. అయితే రైల్వే స్టేషన్ నిర్వహణ వ్యయం, ఆదాయంపై పాండా ఆర్టీఐకి దరఖాస్తు చేయగా..కేవలం ఆదాయ వివరాలను మాత్రమే వెల్లడించారు. నిర్వహణ వ్యయానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.గతేడాది జనవరి 15వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా బిచ్చుపల్లి స్టేషన్ ప్రారంభమైంది. బొలాంగిర్-బిచ్చుపల్లి మార్గంలో ప్రతీ రోజూ ఓ ప్యాసింజర్ రైలు రెండుసార్లు రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్గం పొడవు దాదాపు 16కి.మీ. ఈ రైల్వే మార్గం కోసం ప్రభుత్వం దాదాపు రూ.115 కోట్లు ఖర్చు చేసింది.

ఈ రైల్వేస్టేషన్ ప్రస్తుత ఆదాయం అత్యంత తక్కువగా ఉండవచ్చు గానీ.. భవిష్యత్తులో ఈ రైల్వే మార్గాన్ని సోనేపూర్ స్టేషన్‌ వరకు విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉన్నతాధికారి జేపీ మిశ్రా తెలిపారు. బిచ్చుపల్లి వాసులు చాలామంది సంబల్‌పూర్,తిత్లాఘర్,భవానీపట్నకు వెళ్తుంటారని, కానీ ప్రస్తుతం ఆ మార్గంలో రైల్వే లైన్ అందుబాటులో లేదని చెప్పారు. సోనేపూర్,తిత్లాఘర్ మధ్య ఒక్కసారి రైల్వే లైన్ పూర్తయిందంటే ప్యాసింజర్స్ రాక పెరుగుతుందని మిశ్రా తెలిపారు.