Yediyurappa : భావోద్వేగానికి లోనైన యడియూరప్ప..గవర్నర్ పదవిపై కీలక వ్యాఖ్యలు

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యడియూర‌ప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు.

10TV Telugu News

Yediyurappa క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యడియూర‌ప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు రాష్ట్రానికి కేర్ టేక‌ర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని యడియూరప్పకి గవర్నర్ సూచించారు.

అయితే ఇవాళ గవర్నర్ కి తన రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం రాజ్ భవన్ బయట విలేఖరులతో మాట్లాడిన యడియూరప్ప…రెండు రోజుల క్రితమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డం కోసం తానే స్వ‌చ్ఛందంగా ప‌ద‌వి నుంచి వైదొలిగాన‌ని అన్నారు. కొత్త ముఖ్య‌మంత్రిగా ఎవ‌రిని నియ‌మిస్తే బాగుంటుంద‌నే విష‌యంలో తాను ఎవ‌రి పేరునూ సిఫార‌సు చేయ‌లేదని చెప్పారు.

బీజేపీ హైకమాండ్ ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తే వారి నేతృత్వంలో పనిచేస్తామని యడియూరప్ప తెలిపారు. తాను, తన మద్దతుదారులు వంద శాతం కొత్త సీఎంకి సహకరిస్తామన్నారు. అసంతృప్తి అన్న విషయం గురించి మాట్లాడాల్సిన పని లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డం కోసం త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని యడియూరప్ప చెప్పారు. రెండేళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు అని యడియూరప్ప తెలిపారు. తనను మద్దతుగా నిలిచిన మఠాథిపతులకు కూడా తాను ధన్యవాదాలు చెబుతున్నానని యడియూరప్ప అన్నారు. రాబోయే సీఎంకి కూడా సహకరించాలని మఠాధిపతులను యడియూరప్ప కోరారు.

అయితే యడియూరప్పని ఆంధ్రప్రదేశ్ లేదా బెంగాల్ గవర్నర్ గా బీజేపీ హైకమాండ్ నియమించబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్‌షిప్ ప్రతిపాదనను అంగీకరిస్తారా అని విలేఖరులు యడియూరప్పని ఈ సందర్భంగా ప్రశ్నించగా… నేను గవర్నర్‌గా ఉండటం..వేరే చోటుకి వెళ్లడమన్న ప్రశ్న లేదు అని యడియరప్ప సమాధానమిచ్చారు.

అంతకుముందు.. రెండేళ్ల పాలనను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో యడియూరప్ప భావోద్వేగానికి లోనయ్యారు. రెండేళ్లుగా ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ కోసం ఒంటరిగా పోరాడినట్లు తెలిపారు. యడియూరప్ప మాట్లాడుతూ..బీజేపీ విధానాల ప్రకారం 75 ఏళ్లు దాటిన ఎవరైనా పదవిలో ఉండటానికి వీల్లేదు. కానీ, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. తమ ప్రేమాభిమానాలతో నన్ను సీఎంగా కొనసాగించారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికిలో లేనప్పుడు.. నేను ఒంటరిగా పోరాడి పార్టీని పోటీలోకి తెచ్చాను. పార్టీ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డా. ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. జన్​సంఘ్​లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు, దళితుల కోసం మాట్లాడాను. నా పని పట్ల సంతృప్తిగానే ఉన్నా. వాజ్​పేయీ నన్ను పిలిచి కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే తిరస్కరించాను. కర్ణాటకవ్యాప్తంగా తిరిగి రెండు సీట్లు ఉన్న పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చా. ప్రజలు మమ్మల్ని విస్మరించలేదు. లక్షలాది కార్యకర్తల శ్రమకు గుర్తింపుగా అధికారాన్ని కట్టబెట్టారు అని యడియూరప్ప అన్నారు.

 

10TV Telugu News