స్థానికులకే 75శాతం ఉద్యోగాలు…ఏపీ తరహాలో కర్ణాటకలో చట్టం!

  • Published By: venkaiahnaidu ,Published On : February 6, 2020 / 09:15 PM IST
స్థానికులకే 75శాతం ఉద్యోగాలు…ఏపీ తరహాలో కర్ణాటకలో చట్టం!

ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు ఇండస్ట్రీస్ తో సహా వివిధ రంగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చేలా ఓ చట్టం తీసుకురాబోతున్నట్లు సమాచారం.

కర్ణాటక లేబర్ మినిస్టర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ…ఇది ఎవరినీ వివక్షకు గురిచేసే విషయం కాదని, స్థానికుల ప్రయోజనాల కోసమే ఇటువంటి చట్టం గురించి ఆలోచిస్తున్నామని అన్నారు. బయటివాళ్లు వచ్చి తమ అవకాశాలను స్వాధీనం చేసుకుంటున్నారని,తమకు ఉద్యోగాలు రావడం లేదని కన్నడిగులు తాము వివక్షకు గురవుతున్నామని భావిస్తున్నారని,ఇది గట్టిగా పట్టించుకోవాల్సిన విషయమన్నారు. రాష్ట్ర ప్రజలు, న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాత, ఈ బిల్లును త్వరలో ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు కన్నడిగగా ఎవరు పరిగణించబడతారనే ప్రమాణికతలను ఖరారు చేస్తూ లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. గత 15 సంవత్సరాలుగా కర్ణాటకలో నివసిస్తున్న మరియు కన్నడ తెలిసిన, చదివిన మరియు వ్రాసే ఎవరైనా కన్నడిగగా పరిగణించబడతారు. కర్ణాటక ప్రజలకు కన్నడ చదవడం,రాయడం తెలుసు కనుక ఈ ప్రామాణికత సరిపోతుందని సురేష్ కుమార్ తెలిపారు.

ఈ చట్టం యొక్క ఆవశ్యకత, చట్టబద్ధత గురించి ప్రజలందరినీ, దానిని వ్యతిరేకించేవారిని కూడా ఒప్పించాలని మేము ఆశిస్తున్నాము. ప్రతిఒక్కరి ఏకాభిప్రాయంతో దీన్ని అమలు చేయాలనుకుంటున్నందున మేము అందరితో మాట్లాడుతున్నాము అని మంత్రి చెప్పారు. అయితే పని ప్రదేశాల్లో భాషా అవరోధాల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడమే ఇటువంటి చట్టాన్ని తీసుకురావడానికి మరో కారణం అని అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు.