యతి కాదు..ఎలుగుబంటి

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2019 / 04:23 PM IST
యతి కాదు..ఎలుగుబంటి

పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది. నార్త్ ఈస్ట్రన్ హిమాలయాల్లోని మకలు బేస్‌ క్యాంప్‌ దగ్గర్లో ఏప్రిల్‌-9,2019న భారత సైనికుల బృందం ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు ఆర్మీ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విటర్‌ లో పోస్ట్ చేసింది. 

అయితే నేపాల్ ఆర్మీ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. స్థానికులు, పోర్టర్లు వెల్లడించిన ప్రకారం అవి పర్వతపు ఎలుగుబంటి పాద ముద్రలు కావచ్చని నేపాల్ ఆర్మీ చీఫ్ ప్రతినిధి,బ్రిగేడియర్ జనరల్ బిగ్యాన్ దేవ్ పాండే తెలిపారు. అంతేకాకుండా ఈ పాదముద్రలను భారత్ ఆర్మీ గుర్తించిన సమయంలో  నేపాల్ ఆర్మీకి చెందిన లియైజన్‌ బృందం కూడా భారత ఆర్మీకి దగ్గర్లోనే పనిచేస్తుందని తెలిపారు.అంతేకాకుండా భారత ఆర్మీ చెబుతున్నట్లు ఆ పాద ముద్రలు ఏప్రిల్-9 నాటివి కాదని ఏప్రిల్-11నాటివని ఆయన అన్నారు