కోట్లాది హిందువుల కల : అయోధ్యలో రామ మందిరానికి జులై-1న భూమిపూజ చేయనున్న యోగి

10TV Telugu News

అయోధ్య రామాలయానికి త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నారు. ఆలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. గతేడాది నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుతో దశాబ్దాల హిందువుల కల(రామజన్మభూమిలో రామాలయం) నెరవేరిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన 2.77 ఎకరాల రామజన్మభూమి నిస్సందేహంగా రామ్ లల్లా విరాజ్ మాన్ కే చెందుతుందని సుప్రీంకోర్టు సృష్టంచేసింది.

ఆ తీర్పు దేశంలోని రామభక్తులందరినీ ఆనందంలో ముంచెత్తింది. మందిర నిర్మాణం, నిర్వహణ కోస కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే మసీదు నిర్మించుకోడానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఆదేశించింది. దానిని ప్రభుత్వం ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు కేటాయించి విషయం తెలిసిందే తెలిసిందే.  

అయితే ఇప్పుడు అన్  లాక్ 1లో భాగంగా  నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో  అయోధ్యలో  రామ మందిరానికి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పుతో రెట్టించిన ఉత్సాహంతో పనులు జరుగుతుండగా.. ప్రతిపాదిత అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయానికి సంబంధించిన 70 ఎకరాల్లో భూమిని చదును చేశారు. జూలై 1వ తేదీన భూమి పూజను నిర్వహించేందుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లను చేస్తోంది.

జులై 1న రామ మందిరానికి  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భూమి పూజను చేయనున్నారు. ప్రధాని మోడీని ఫిబ్రవరిలోనే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రధాని హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఢిల్లీలోనే ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం. పూజలు నిర్వహించి, ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మిశ్రా భూమి పూజలో పాల్గొంటారని సమాచారం. .

మరోవైపపు ఇప్పటికే కలెక్టర్ అనుమతితో ట్రస్ట్ ఇక్కడ మే 11 నుంచి చదును చేసే పనులు ప్రారంభించింది. మందిర నిర్మాణం కొనసాగించడానికి వీలుగా, అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ దారి, యాంగిల్స్ లాంటివి తొలగించి ట్రస్ట్ ఆ ప్రాంతమంతా చదును చేస్తోంది. రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు రామ్ లల్లాను ప్రతిష్ఠించిన ప్రాంతంలో ప్రస్తుతం భూమి చదును చేసే పనులు జరుగుతున్నాయి.