ఫోన్ పబ్లిక్ చార్జింగ్ లో పెట్టారంటే అడ్డంగా బుక్కవుతారు

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న ఏ షాపింగ్ మాల్ లోనో, రైల్వే స్టేషన్ లోనో, బస్టాండ్ లోనో పెట్టిన పబ్లిక్ చార్జింగ్ పాయింట్ కి వెళ్లి ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటాం. లేదా ఫోన్ చార్జింగ్ కోసం ఉన్న చిన్న,చిన్న కంప్యూటర్ షాపులపై ఆధారపడతాం. ఇలా ఎక్కడపడితే అక్కడ ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటే మీ బ్యాంకుబ్యాలెన్స్ ఖాళీ కావచ్చు, మీ పర్సనల్ ఫోటోలు,వీడియోలు అంతర్జాలంలో చక్కర్లు కొట్టవచ్చు, వాటిని అడ్డం పెట్టుకుని హ్యాకర్లు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఇలా ఏదోరకంగా మీరు ఇబ్బందులకు గురవ్వవచ్చు. అదెలాగా అంటారా.. జ్యూస్ జాకింగ్ వల్ల,
“జ్యూస్ జాకింగ్”
“జ్యూస్ జాకింగ్” అంటే చార్జింగ్ పెట్టిన మీ ఫోన్ లోని డేటాను తస్కరించి తద్వారా మీ బ్యాంక్ ఎకౌంట్ పాస్ వర్డ్ లు తెలుసుకుని మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇదేలా సాధ్యమని మీ అనుమానం. ఇందులో టెక్నిక్ చాలా సింపుల్. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లతోపాటు చాలా షాపింగ్ మాల్స్ లో ఇటీవల స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు కదా…. హ్యాకర్లు అక్కడి యూఎస్‌బీ పోర్ట్‌లను మార్చేస్తారు. ఇదేమీ తెలియని మనం ఆపోర్ట్‌కు మన ల్యాప్‌టాప్/ఫోన్‌లను కనెక్ట్ చేసి మన గాడ్జెట్లు చార్జ్ చేసుకుంటున్నాం. అదే సమయంలో వాటిలోని మన వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. మనం చార్జింగ్ పెట్టిన చోట, హ్యాకర్లు మార్చేసిన యూఎస్‌బీ పోర్టులోనే సమాచారాన్ని తస్కరించేందుకు, స్టోర్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండటంతో ఇది చాలా తేలికగా సాధ్యమవుతోంది. లేదంటే.. స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌లోకి దురుద్దేశపూర్వకమైన మాల్‌వేర్‌ను జొప్పించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాల్‌వేర్ ద్వారా డేటా మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు లాక్ చేసేస్తారు. లాక్ ఓపెన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారు. లేదంటే మీరు పాస్‌వర్డ్, యూజర్‌నేమ్ వంటివి మీ గాడ్జెట్‌లో స్టోర్ చేసుకుని ఉంటే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయి డబ్బులు కాజేసేందుకూ అవకాశం ఉంది. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు.ఢిల్లీ లో ఒక యువకుడి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకర్లు ఇలా జ్యూస్ జాక్ చేశారన్న వార్తలు రావడంతో గత పదిరోజులుగా జ్యూస్ జాకింగ్ పై మళ్లీ చర్చ మొదలైంది.
“ఎప్పుడు మొదలైంది”
2011లోనే కొంతమంది టెకీలు జ్యూస్ జాకింగ్ పేరును ఖాయం చేశారు. ఆ ఏడాది జరిగిన అంతర్జాతీయ హ్యాకర్ల సమావేశం డెఫ్‌కాన్‌లో కొంతమంది మార్చేసిన యూఎస్‌బీ పోర్టులతో ఒక చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. గాడ్జెట్ ఏదీ చార్జింగ్‌కు లేనప్పుడు ఈస్టేషన్ తాలూకూ ఎల్‌సీడీ తెరపై ఉచిత చార్జింగ్ కేంద్రం అన్న ప్రకటన చూపుతూ ఉండగా.. స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌ను అనుసంధానించగానే సమాచారాన్ని దోచుకునే మాల్‌వేర్‌ను పంపించారు. ఆతరువాత దీని గురించి గాడ్జెట్ యజమానులకు వివరించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు కూడా. అయితే అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకూ ఈ జ్యూస్ జాకింగ్‌ను వాడింది చాలా తక్కువ.
“ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి”
ఏముంది.. ఎక్కడపడితే అక్కడ చార్జింగ్ చేసుకోవటం మానేస్తే సగం సమస్యలు తీరిపోతాయి. ఇది జరగాలంటే వీలైనంత వరకూ మన ఫోన్/ల్యాప్‌టాప్ ఇంట్లోనే ఫుల్‌గా చార్జింగ్ చేసుకొని బయటకు బయల్దేరాలి. లేదంటే.. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఒకటి ఎక్స్‌ట్రా పట్టుకెళ్లాలి. స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే మంచి పవర్‌బ్యాంక్ ఒకటి దగ్గరుంచుకోవాలి. ఇవేవీ కుదరపోతే చార్జింగ్ స్టేషన్లలోని యూఎస్‌బీ పోర్టులను ఉపయోగించకుండా.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ప్లగ్‌ల ద్వారా మీ సొంత చార్జర్‌తో ఫోన్/ల్యాప్‌టాప్ చార్జ్ చేసుకోవాలి. ఎందుకంటే కరెంట్ ప్రవహించే చోట డేటా ట్రాన్స్‌ఫర్ సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ యూఎస్‌బీ పోర్టు ద్వారానే చార్జ్ చేసుకోవాల్సి వస్తే మీ గాడ్జెట్‌ను ఆఫ్ చేసి చార్జి చేసుకోండి. దీంతో కూడా డేటా ట్రాన్స్‌ఫర్ జరగదు కాబట్టి ఎవరూ మీ గాడ్జెట్‌లోకి మాల్‌వేర్‌ను వేయడంగానీ.. సమాచారాన్ని తస్కరించడం గానీ జరగదు.