కారు కోసం కిడ్నాప్ డ్రామా …అరెస్టైన 20 ఏళ్ల యువకుడు, స్నేహితుడు

  • Published By: murthy ,Published On : October 7, 2020 / 12:07 PM IST
కారు కోసం కిడ్నాప్ డ్రామా …అరెస్టైన 20 ఏళ్ల  యువకుడు, స్నేహితుడు

పిల్లలన్నాక సరదాలు ఉంటాయి. వాటిలో చాలావరకు పెద్దలు తీరుస్తూనే ఉంటారు, కానీ పిల్లల భద్రత దృష్ట్యానో మరో కారణం చేతో కొన్ని వాయిదా వేస్తూంటారు. యూపీలోని నోయిడాకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడు కారు కొనుక్కోవాలనుకున్నాడు. తల్లి తండ్రులు అందుకు ఒప్పుకోలేదు. కారు కొనుక్కోటానికి తల్లి తండ్రుల వద్ద నుంచి డబ్బు కాజేయటానికి తన స్నేహితుడితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు.

నోయిడాలోని ప్రగతి విహార్ లో నివాసం ఉండే ఆకాష్ సింగ్ (20) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ కిడ్నాప్ డ్రామా ఆడాడు. 8వ తరగతి వరకు చదివిన ఆకాష్ సింగ్ కు కారు కొనుక్కుని తిరగాలని కోరిక పుట్టింది. ఇంట్లో తల్లి తండ్రులు అందుకు ఒప్పుకోలేదు. తన అన్న బైక్ ఇచ్చి అది వాడుకోమన్నారు. కానీ దానితో సంతృప్తి పడని ఆకాష్ సింగ్ కు కారు మీదే మోజు ఉంది. తల్లి తండ్రులేమో ఒప్పుకోవటం లేదు. ఏం చేయాలా అని ఆలోచించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు.



తనను కిడ్నాప్ చేసినట్లు నాటకమాడమని…తల్లి తండ్రులను డబ్బులు డిమాండ్ చేయమని చెప్పాడు. ఇందుకోసం నోయిడా లోని ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి ఒకరోజు రిహార్సల్స్ కూడా చేసుకున్నారు. ప్లాన్ అమలులో భాగంగా …. అక్టోబర్ 5 సోమవారం ఉదయం తన స్నేహితుడు రమ్మన్నాడని అతని దగ్గరుకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చిన ఆకాష్ రాత్రి11 గంటలైన ఇంటికి చేరుకోలేదు. ఇంట్లో వారు కంగారు పడ్డారు.

రాత్రి 11 గంటల తర్వాత ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. మీ పిల్లాడు మా దగ్గరే ఉన్నాడని….. అతడ్ని కిడ్నాప్ చేశామని…విడుదల చేయాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని అవతలి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే మీ పిల్లాడ్ని చంపేస్తామని కూడా ఆ వ్యక్తి ఫోన్ లో బెదిరించాడు. ఆ రాత్రి ఏమీ తోచని తల్లి తండ్రులు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసారు.



సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఆ వ్యక్తి ఆకాష్ కుటుంబానికి నాలుగు సార్లు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు నెట్ వర్క్ ట్రాకింగ్ ద్వారా ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తోందో గుర్తించారు. నోయిడా సెక్టార్ -22 లో ఉన్న హోటల్ పై దాడి చేసి ఆకాష్ ను అతడి స్నేహితుడు అంకిత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ డ్రామాకు సహకరించిన మరోక స్నేహితుడు పరారీలో ఉన్నాడు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.