DK Shivakumar – YS Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ.. తెలంగాణలో పొత్తులకు సంకేతమా..?

కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టిందా?. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంకాగాంధీ షర్మిలకు ఫోన్ చేయటం..తాజాగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకేతో భేటీ వంటి పలు ఆసక్తికర పరిణామాలు దేనికి సంకేతం?

DK Shivakumar – YS Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ.. తెలంగాణలో పొత్తులకు సంకేతమా..?

DK Shivakumar-YS Sharmila

DK Shivakumar – YS Sharmila Meet : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు. బెంగళూరులో డీకేను కలిసి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అంటూ షర్మిల శివకుమార్ ను అభినందలు తెలిపారు. వైఎస్సార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా  డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు.

కాగా పార్టీ ఏర్పాటు చేసినప్పటినుంచి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయంలో తనదైన మార్కుతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు, సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టింది. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంక గాంధీ.. షర్మిలకు ఫోన్ చేయటం పలు విషయాలు మాట్లాడటం సంచలనంగా మారింది. ప్రియాంక ఫోన్ కు షర్మిల కూడా సానుకూలంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. దీంతో షర్మిల కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా? అనిపిస్తోంది. తాజాగా డీకే శివకుమార్ తో భేటీ కావటంతో షర్మిల.. కాంగ్రెస్ కు మరింత దగ్గరయ్యారనిపిస్తోంది.

కాగా కర్ణాటకలో బీజేపీని చిత్తు చేసి.. అఖండ మెజారీటీ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంది. అదే జోష్ ను ఇతర రాష్ట్రాల్లో కూడా చూపించటానికి సమాయత్తమవుతోంది. మరి ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడ ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ వేస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ను ఎదుర్కోవటానికి కసరత్తు చేస్తోంది. దీనికి షర్మిల తోడైతే మరింత లబ్ది చేకూర్చుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. అందుకే కర్ణాటక ఎన్నికల విజయం తరువాత ప్రియాంక గాంధీ స్వయంగా షర్మిలకు ఫోన్ చేసిన మాట్లాడారు. ఇది తెలంగాణ రాజకీయ వ్యూహాల్లో భాగమని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ తెలంగాణలో బహిరంగసభలో పాల్గొన్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్‌ను ఎదుర్కోవటానికి కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటే అధికారం చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిల కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌తో సమావేశం కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సిద్ధరామయ్య సీఎంకాగా డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన విషయం తెలసిందే. ఈ క్రమంలో శివకుమార్ తో షర్మిల భేటీ వెనుక ఉన్న కారణమేంటనే ఆసక్తి నెలకొంది. వీరిద్దరి భేటీతో షర్మిల.. కాంగ్రెస్ కు మరింత దగ్గరవుతున్నారా? అనేలా ఉంది.