Zee Entertainment – Sony India: సోనీ ఇండియాతో విలీనం అవుతున్న జీ ఎంటర్‌టైన్మెంట్.. ఈ లెక్కే వేరు

ఇండియన్ మీడియాలో కీలక విలీన అగ్రిమెంట్ దాదాపు కన్ఫామ్ అయింది. ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌... సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియాతో..

Zee Entertainment – Sony India: సోనీ ఇండియాతో విలీనం అవుతున్న జీ ఎంటర్‌టైన్మెంట్.. ఈ లెక్కే వేరు

Zee Entertainment Sony

Zee Entertainment – Sony India: ఇండియన్ మీడియాలో కీలక విలీన అగ్రిమెంట్ దాదాపు కన్ఫామ్ అయింది. ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌… సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియాతో విలీన ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం మాత్రమే వాటాలుంటాయి. మిగిలిన 52.93 శాతం వాటా ఎస్‌పీఎన్‌ఐకు దక్కుతాయి.

అగ్రిమెంట్‌ను బట్టి.. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్‌ 1.575 బిలియన్‌ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. ప్రస్తుతం జీ సీఈఓగా పునీత్‌ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. ఆర్థికపరమైన అంశాలే కాకుండా సోనీతో పార్టనర్‌షిప్ వల్ల వ్యూహాత్మక విలువను కూడా పరిగణనలోకి తీసుకున్నామని జీ బోర్డు తెలిపింది. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది.

ఇరు కంపెనీలు ఇక నుంచి డిజిటల్‌ అసెట్స్‌, లీనియర్‌ నెట్‌వర్క్స్‌, ప్రోగ్రాం లైబ్రరీస్‌, ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌ వంటి వ్యవహారాలను సమంగా పంచుకోనున్నాయి. అగ్రిమెంట్‌ను అమలు చేయడానికి ముందు చేయాల్సిన వ్యవహరాలకు 90 రోజుల గడువు నిర్దేశించారు. అదే సమయంలో జీ ప్రమోటర్ల కుటుంబం.. 4 శాతంగా ఉన్న ప్రస్తుత వాటాల్ని 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశం దొరికింది. విలీనం తర్వాత ఏర్పడే బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లను సోనీ గ్రూపే నియమిస్తుంది.

మూడు దశాబ్దాలుగా వినియోగదారులకు చేరువైన జీ నెట్‌వర్క్‌కు కంటెంట్‌ క్రియేషన్‌లో మంచి అనుభవం ఉంది. గేమింగ్‌, స్పోర్ట్స్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో సోనీ మంచి విజయాన్ని అందుకుంది. ఇరు కంపెనీల కలయుకతో ఏర్పడే సంస్థకు వ్యూహాత్మక విలువతో పాటు భారీ ఆదరణ చేకూరుతుందని భావిస్తున్నారు.