Food Delivery: ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీలపై బాదుడే.. రేపటి నుంచే!

అసలే కరోనా టైమ్‌.. ఒమిక్రాన్‌ భయం ఆందోళన రేపుతోంది.

Food Delivery: ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీలపై బాదుడే.. రేపటి నుంచే!

Food Business

Food Delivery: అసలే కరోనా టైమ్‌.. ఒమిక్రాన్‌ భయం ఆందోళన రేపుతోంది. బయటకు వెళ్లి వైరస్‌ను అంటించుకోవడం కంటే…ఇంట్లోనే ఉండి…ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్‌లో ద్వారా ఆర్డర్ ఇస్తే… హాయిగా ఆరగించవచ్చని చాలా మంది అనుకుంటారు. ఏ స్విగ్గీలోనో? జొమోటాలోనో? ఆర్డర్‌ ఇచ్చేద్దాం.. ఆఫర్‌లు ఉంటాయి. ఇంటికే వస్తుంది.. ఖర్చు తక్కువ అని అనుకుంటున్నారా? అయితే రేపటి నుంచి ఆల్‌లైన్‌లో మీరు ఫుడ్‌ బుక్ చేసుకుంటే… మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు కొత్త ఏడాదిలో మరింత ప్రియంకానున్నాయ్‌. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ ఇకపై నేరుగా కస్టమర్‌ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి.

మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేటప్పుడు ఆహారానికిగానూ గతంలో రెస్టారెంట్లు ఐదు శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు గానూ కొంతమొత్తం వినియోగదారుల నుంచి వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపులేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. లక్నో వేదికగా సెప్టెంబర్ 17న జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ సమావేశంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

అయితే కొత్త నిబంధన కారణంగా వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం వాదిస్తోంది.. సరైన పన్ను చెల్లింపులు లేని కారణంగా.. గత రెండేళ్లలో దాదాపు 2 వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు తెలిపింది కేంద్రం. దీంతో పన్ను ఆదాయం తగ్గుతోందని భావించి ఫుడ్‌ అగ్రిగేటర్లే ఇకపై తమకు వచ్చే ఆర్డర్లపై పన్ను చెల్లించాలని ఆదేశించింది. అంటే.. రెస్టారెంట్లు సొమ్ము చేసుకుంటున్న పన్నును వారి నుంచి వసూలు చేసి స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు కేంద్రానికి చెల్లించాలన్నమాట. ఈ లావాదేవీలో వినియోగదారుడిపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదని అంటోంది కేంద్రం.

అయితే.. స్వీగ్గీ, జొమాటోల్లో 5శాతం పన్నును వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రెస్టారెంట్‌లలో 18శాతం జీఎస్టీని వసూలు చేస్తొంది కేంద్రం. దీని ప్రకారం.. స్విగ్గీలో టాక్స్‌ కడుతున్నాం కాబట్టి ప్రభుత్వానికి టాక్స్‌ ఇంక కట్టాల్సిన అవసరం లేదు… కానీ.. ఫుడ్‌ అగ్రిగేటర్స్‌ మళ్లీ జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. వినియోగదారుల వద్ద నుంచి జీఎస్టీని వసూలు చేసి.. కేంద్రానికి అప్పగించే బాధ్యత ఫుడ్ డెలివరీ సంస్థలదే. దీంతో ఆయా సంస్థలు ఎక్కువ ఛార్జీలు మోపే అవకాశం కనిపిస్తోంది. ఆ సంస్థలు మోపే భారం జీఎస్టీ కంటే ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.