బలమైన కేడర్ ఉంది, కానీ.. నడిపించే నాయకుడే లేడు.. నెల్లూరు టీడీపీకి ఎందుకీ దుస్థితి, కారణం ఎవరు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

nellore TDP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నాయకుడు రావడంతో పార్టీ కేడర్ చిన్నాభిన్నం అవుతూ వస్తోందని చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి వైసీపీకి చెందిన మేకపాటి కుటుంబం హవా కొనసాగుతోంది.

తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా కరువయ్యాడు:
2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి మురళీ కన్నబాబు ప్రస్తుత మంత్రి మేకపాటి గౌతంరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో గౌతమ్‌రెడ్డిపై బొల్లినేని క్రిష్ణయ్యను టీడీపీ రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. ఓటమి తర్వాత క్రిష్ణయ్య నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని టాక్‌. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా కరువయ్యారు. తరచూ నియోజకవర్గంలో ఎక్కడో ఓ చోట గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఈ నియోజకవర్గంలో వర్గ కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్త బలయ్యాడు. అప్పుడప్పుడు కన్నబాబు వచ్చి మాత్రమే పరామర్శిస్తున్నారు తప్ప మరే నాయకుడు వచ్చిన దాఖలాలు లేవు.

మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డికి ఇంచార్జి పదవి:
ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఇన్‌చార్జిగా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తిగా మారింది. మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఇన్‌చార్జీ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అటూ ఇటూ పార్టీలు మారే వారికి కాకుండా గతంలో ఇంచార్జీగా పనిచేసి కష్టకాలంలో అండగా ఉన్న కన్నబాబుకు అవకాశం ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. అధిష్టానం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మరోవైపు సీనియర్ నేత కొమ్మి లక్ష్మయ్యనాయుడు మాత్రం జరుగుతున్న పరిణామాలను చూస్తూ మౌనంగా ఉన్నారు.

బొల్లినేని రామారావుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు:
ఇక ఉదయగిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. స్థానికంగా అందుబాటులో కూడా ఉండని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. పార్టీలోని అనేక మంది కార్యకర్తలు వలసలు వెళుతున్నా రామారావు పట్టించుకోవడం లేదని టాక్‌. స్థానిక సంస్థల ఎన్నికల నోటిపికేషన్‌కు ముందు టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఈ విషయంలో పార్టీ తరఫున ఎలాంటి సాయం అందలేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఓటమి తర్వాత కన్నెత్తి చూడని బొల్లినేని:
వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉపఎన్నికల సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బొల్లినేని రామారావు 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. తన ఓటమి తర్వాత రామారావు నియోజకవర్గం వైపు చూసింది రెండు మూడు సార్లే. మహారాష్ట్ర, కర్ణాటకలోని తన వ్యాపారాలతో బిజీగా ఉండటంతో పార్టీ గురించి పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు.

ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోవాలి:
మాజీ మంత్రి దివంగత మాదాల జానకిరాం సమీప బంధువైన మదన్ 2019 ఎన్నికల ముందు యాక్టివ్‌గా ఉండి టికెట్ కోసం ప్రయత్నించారు. రామారావుకు టికెట్‌ రావడంతో పార్టీ కోసం పనిచేశారు మదన్‌. ప్రస్తుతం ఆయన ఇన్‌చార్జి పదవి కోరుకుంటున్నారట. గత ఎన్నికల ముందు హడావుడి చేసిన చాలామంది నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. స్థానికంగా ఉండే వారికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ బలంగా వున్నా నాయకులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటేనే పార్టీకి భవిష్యత్‌ ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు.

Related Tags :

Related Posts :