లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

విశాఖలో కొత్త జిల్లాలు, ఎందుకు చర్చకు దారితీసింది, అల్లూరి పేరు వద్దనడానికి కారణమేంటి

Published

on

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూపం ఏంటి? దాని చరిత్ర, కొత్త పేర్లు, వాటి డిమాండ్లు ఏంటి?

వైజాగ్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఏర్పాటు:
విశాఖ జిల్లా… దేశంలోనే అత్యంత పురాతన జిల్లాల్లో ఒకటి. మొదట ఫ్రెంచ్ వారు.. ఆ తరువాత బ్రిటీషు ఏలుబడిలో అప్పట్లోనే దేశంలో ప్రముఖ నగరంగా ఆవిర్భవించింది. ఇదే సమయంలో మన్యంలో అల్లూరి తిరుగుబాటు వల్ల విశాఖ ఏజన్సీలోని మారుమూల చింతపల్లి కూడా బయట ప్రపంచానికి తెలిసింది. 1936లో వైజాగపట్నం జిల్లాగా ఉండేది. నవరంగపూర్, మల్కన్ గిరి, కోరాపుట్, జయపూర్, రాయగడ, గంజాం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం కలిపి ఉండేవి. అయితే పరిపాలన సౌలభ్యం కోసం 1950లో శ్రీకాకుళం జిల్లాను వైజాగ్ జిల్లా నుంచి వేరు చేశారు. అనంతరం 1979లో మరోసారి జిల్లాను విభజించడంతో విజయనగరం జిల్లా ఆవిర్భవించింది.

3 పార్లమెంటు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు:
ప్రస్తుతం జిల్లాలో విశాఖ, అరకు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 15 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉనికిలో ఉన్నాయి. ఇందులో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజక వర్గాలు వస్తాయి. విశాఖ పార్లమెంట్ స్థానం తీసుకుంటే విశాఖ సిటీలోని నాలుగు నియోజక వర్గాలతో పాటు భీమిలి, గాజువాక, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట కూట విశాఖ పార్లమెంట్ స్థానం కిందకు వస్తుంది. అన్నింటికంటే సంక్లిష్టమైన పార్లమెంట్ నియోజకవర్గం అరకు. రాష్ట్రంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఇది.

3 గిరిజన జిల్లాలుగా అరకు పార్లమెంటు నియోజకవర్గ విభజన:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి పరిధిలో నాలుగు జిల్లాలు… ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 46 మ౦డలాలతో అరకు పార్లమెంటరీ నియోజకవర్గ౦ విస్తరించి ఉంది. 14లక్షల 49వేల మ౦ది ఓటర్లు ఉన్నారు. జిల్లాల విభజన ప్రతిపాదనతో భౌగోళిక స్వరూపాలు, స్వతంత్ర ప్రతిపత్తి, జిల్లాలకు నూతన పేర్లు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. నూతన౦గా ఏర్పాటయ్యే ఏదైనా ఓ జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తుంటే… అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని 3 గిరిజన జిల్లాలుగా విభజించి వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలని గిరిజన స౦ఘాలు కోరుతున్నాయి.

మూడు జిల్లాలుగా విశాఖ జిల్లా:
ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న అలోచనలో ప్రభుత్వం ఉండటంతో… విశాఖ జిల్లా ఇపుడు మూడు జిల్లాలుగా మారే అవకాశముంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశాఖ మహా నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ… జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం ఇ౦కా అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రమైన విశాఖ ఓ మూలన ఉండటంతో అటు ఏజెన్సీలోని సీలేరు, ము౦చి౦గిపుట్టు లాం౦టి ప్రా౦తాలవారు జిల్లా కేంద్రానికి వచ్చి పోవాల౦టే ఓ రోజంతా పడుతుంది. ప్రస్తుతమున్న అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధి మూడు జిల్లాల్లో ఉన్నందున ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే పరిపాలన భార౦, దూరాభారం లాం౦టి సమస్యలతో పాటు వైద్య, ఆరోగ్య సేవలు గిరిజనులకు మరింత దూరం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. గిరిజన చట్టాలు లాంటివి సక్రమ౦గా అమలు జరగాలన్నా… గిరిజనేతరుల ఆధిపత్యం నుంచి బయటపడాలన్నా… స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మూడు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయాల౦టున్నారు. ఇదే సమయంలో అరకు జిల్లాకు అల్లూరి పేరు వద్దని… అరకు నియోజకవర్గం అని కానీ… లేక గిరిజన వీరులైన గంటం దొర, మల్లు దొర పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కమిటీ నివేదిక ఆధారంగానే జిల్లాల విభజన:
ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా… ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ఆధారంగానే జిల్లాల విభజన ఉంటుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కొత్త జిల్లాల పేర్లను కూడా స్థానికుల అభిప్రాయం తీసుకున్నాకే ప్రభుత్వం ఖరారు చేస్తుందన్నారు. విశాఖ రూరల్ ప్రాంతానికి అనకాపల్లి కేంద్రంగా ఉండే అవకాశముంది. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావు పేట, యలమంచిలి, అనకాపల్లి ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ… పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. కానీ, సిటీకి చాలా దగ్గర నేపథ్యంలో పెందుర్తిని విశాఖ అర్భన్ జిల్లాలో కలిపే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే ఎస్.కోటను కూడా విజయనగరం జిల్లాలోకి మార్చే అవకాశముందని తెలుస్తోంది.