పాపం రాజాసింగ్, ఇలాంటి కష్టం ఏ పార్టీ ఎమ్మెల్యేకి రాకూడదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నామని.. కేసీఆర్ దిమ్మతిరిగేలా షాక్ ఇస్తామని ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.

కానీ, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అవసరమైన మెటీరియల్‌ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇవ్వడం లేదంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చుట్టూ ఎంఐఎం ప్రాబల్యం ఉన్న గోషామహల్ నుంచి రెండుసార్లు బీజేపీ జెండా ఎగరవేసిన తనను పార్టీ నేతలు లెక్క చేయడం లేదని లోలోపల ఫీలవుతున్నారట రాజాసింగ్‌.

లీక్ అయిన వాట్సాప్ మేసేజ్:
తన అనుచరులకు కూడా రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వలేదని నాయకత్వంపై రాజాసింగ్‌ గుర్రుగా ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజాసింగ్‌ పర్సనల్‌గా చేసిన వాట్సాప్ మెసేజ్ బయటకు రావడంతో బీజేపీలో విభేదాలు బయటకు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ అలకబూనారనే ప్రచారం మొదలైంది. నాయకత్వ తీరుకు నిరసనగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ విషయం తెలిసి రాజాసింగ్‌తో పార్టీ అధ్యక్షుడు సంజయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

మెటీరియల్ ఇవ్వడం లేదని ఆవేదన:
పార్టీతో రాజాసింగ్‌కు ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు సంజయ్‌ ప్రయత్నించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారట. కానీ ఆ హామీ నెరవేరలేదంటున్నారు రాజాసింగ్.

ఎమ్మెల్సీ రామచంద్రరావుకు మండలిలో మాట్లాడేందుకు కావలసిన మెటీరియల్ అందిస్తున్న పార్టీ.. తనకు మాత్రం ఇవ్వడం లేదని ఆయన తన అనుచరుల ముందు వాపోతున్నారట. కనీసం ఏ అంశంపై వాయిదా తీర్మానాలు ఇవ్వాలో చెప్పడం లేదంట. ఇప్పుడు ఇదే అంశం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.

మరోదారి లేక మౌనంగా ఉండిపోతున్న రాజాసింగ్:
మండలిలో ప్రతి రోజు వాయిదా తీర్మానాలు ఇస్తున్న బీజేపీ అసెంబ్లీలో మాత్రం వాయిదా తీర్మానాలు ఇవ్వలేకపోతోంది. దీంతో రాజసింగ్‌కు పార్టీ సహకరించడం లేదన్న వార్తలకు బలం చేకూరుతోందని జనాలు అంటున్నారు.

పార్టీ సహకారం లేకుంటే ఆయన సొంతంగా వాయిదా తీర్మానాలు తీసుకోవచ్చు కదా అని కొందరు నేతలు అంటున్నారు. పార్టీని కాదని ఆయన సొంతంగా ఏదైనా అంశంపై వాయిదా తీర్మానం ఇస్తే మళ్లీ ఎక్కడ తప్పు పడుతుందోనన్న కారణంగానే రాజాసింగ్‌ మౌనంగా ఉండిపోతున్నారట.

READ  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలి : సీఎం కేసీఆర్ Related Posts