గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి కొత్త కష్టం, ఆందోళనలో కేడర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

congress hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ చందంగా గ్రేట‌ర్ ఎన్నిక‌లు తయారయ్యాయ‌ని అంటున్నారు. ఇప్పటికే వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక‌ల గంట మోగ‌గానే.. ముఖ్య నేత‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. తెలంగాణ రాష్ట్రం త‌మ వ‌ల్లే ఏర్పాటైంద‌ని చెప్పుకోవ‌డ‌మే త‌ప్పితే… ఏ ఎన్నిక‌ల్లోనూ ప్రజ‌లు తమ పార్టీని అక్కున చేర్చుకోవ‌డం లేద‌నే బాధతో కాంగ్రెస్‌ నేతలు కుమిలిపోతున్నారు.

ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక‌లోనూ నెగిటివ్‌ ఫలితాలనే చూసింది. ఈ నేపథ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేషన్‌ ఎన్నిక‌ల పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోందని చెబుతున్నారు.

పట్టున్న నేతలు కరువు:
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొందామని ప్లాన్స్‌ వేస్తున్నా కాంగ్రెస్‌ పార్టీకి నాయ‌క‌త్వ స‌మ‌స్య ప‌ట్టిపీడిస్తోంద‌ని టాక్‌. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీనియ‌ర్ నేత‌లు పార్టీలో ఉండ‌టంతో కాస్తో, కూస్తో పోరాడ‌గ‌లిగింది. సిటీలో స‌బితా ఇంద్రారెడ్డి, దానం నాగేంద‌ర్‌, ముఖేశ్‌గౌడ్‌, సుధీర్ రెడ్డి, స‌ర్వే స‌త్యనారాయ‌ణ‌ వంటి నేత‌లంతా ఇప్పుడు పార్టీకి దూర‌మ‌య్యారు. న‌గ‌రంలో మంచి ప‌ట్టున్న నేత‌లు లేక‌పోవ‌డంతో ప్రస్తుత ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కోవాలే అర్థం కాక హస్తం పార్టీ తల పట్టుకుంటోందని అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్…ఐదు పార్లమెంట్ స్థానాలకు కమిటీలు


నడిపించే నాయకుడే కనిపించడం లేదు:
భారీ వర్షాలతో నగరంలో వరదలు వచ్చాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎంతో కొంత అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటుందనే అంచనాలున్నాయి. వాటన్నింటినీ అస్త్రాలుగా మలచుకొని అధికార పార్టీపై పోరాటం చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి.. ఇప్పుడు నడిపించే నాయకులే కనిపించడం లేదని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక, పార్టీలో ఉన్న కొద్ది మంది నేతల్లో చాలా మంది పార్టీతో అంటీముట్టన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఉంది.

సిటీలో ముందుండి న‌డిపించే నాయ‌కుల కోసం ఎదురుచూపులు:
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువ‌ర్ధన్‌రెడ్డి గాంధీభ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూడ‌టం లేద‌ట‌. ప్రస్తుతం గ్రేట‌ర్ ఎన్నిక‌ల భారం మొత్తం సిటీ ప్రెసిడెంట్ అంజ‌న్ కుమార్ యాద‌వ్ మీద‌నే ప‌డుతోందని అంటున్నారు. ఆయ‌న కూడా త‌న ఒక్కడి వ‌ల్లే సాధ్యం కాద‌ని పార్టీ పెద్దల‌కు తెగేసి చెప్పేశారట. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీకి సిటీలో ముందుండి న‌డిపించే నాయ‌కులు కావాల‌ని ఇప్పుడు ఎదురు చూస్తోంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గర ప‌డుతోన్న స‌మ‌యంలోనైనా ఈ కొర‌త తీరుతుందో లేదో చూడాలి.

Related Tags :

Related Posts :