new-twist-in-deepika-kidnap-case

దీపిక కిడ్నాప్ కేసులో ట్విస్ట్, ముంబైకి వెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

deepika kidnap case: సస్పెన్స్‌గా మారిన వికారాబాద్ దీపిక కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం వికారాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన దీపిక.. ఇష్టపూర్వకంగానే భర్త అఖిల్‌తో వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రుల బలవంతంతోనే అఖిల్‌తో దీపిక విడాకులకు సిద్ధమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూనే అఖిల్‌తో దీపిక సంబంధం కొనసాగించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్‌కు గురైందనుకుంటున్న దీపిక.. ముంబైలోని భర్త ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

రోడ్డుపై వెళ్తుండగా భర్త కారులో ఎత్తుకెళ్లారు:
వికారాబాద్‌లో ఆదివారం(సెప్టెంబర్ 27,2020) నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దీపికను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దీపికను ఆమె భర్త కారులో వచ్చిన దుండగులు అదే కారులో ఎత్తుకెళ్లారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దీపికను ఆమె భర్త అఖిల్ కిడ్నాప్ చేసినట్లు భావించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.

భార్య, భర్తల ఫోన్లు స్విచ్చాఫ్:
దీపిక కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దీపిక కిడ్నాప్‌కు సహకరించిన భర్త అఖిల్‌ స్నేహితులను పోలీసులు విచారించారు. అఖిల్‌కు సంబంధించిన కారులోనే దీపికను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. పెళ్లి అయినప్పటికీ అఖిల్‌, దీపిక రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. దీపిక ఎక్కడుందనే విషయం తెలియదని పోలీసులతో చెప్పారు. ఇక 6 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా దీపిక, అఖిల్‌ ఆచూకీ పోలీసులకు దొరకలేదు. ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉండటంతో కేసును ఛేదించడం కష్టంగా మారిందంటున్నారు. మరోవైపు దీపిక ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తల్లిదండ్రులకు చెప్పకుండా 2016లోనే ప్రేమ పెళ్లి:
కిడ్నాప్‌కు గురైన దీపిక, అఖిల్‌ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో రెండేళ్ల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే శనివారం(సెప్టెంబర్ 26,2020) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఇక ఆదివారం సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి దీపికను కారులో ఎత్తుకెళ్లారు. ఆమె పక్కనున్న సోదరిని తోసి వెళ్లిపోయారు. దీంతో దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Related Posts