New virus, like swine flu, with potential to trigger pandemic found in China

కరోనా నుంచి కోలుకోకముందే చైనాలో మరో భయంకరమైన వైరస్, మానవజాతికి పొంచి ఉన్న ముప్పు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచానికి మరో ప్రమాదకర వైరస్ ముప్పు పొంచి ఉందా? కరోనా లాగే ఆ వైరస్ కూడా మానవాళికి మహమ్మారిగా మారనుందా? ఆ వైరస్ కూడా చైనాలోనే పుట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రాణభయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇది చాలదన్నట్టు చైనా పరిశోధకులు మరో బాంబు పేల్చారు. ప్రపంచానికి మరో ప్రాణాంతక వైరస్ ముప్పు పొంచి ఉందని చెప్పారు. రానున్న రోజల్లో మనుషుల పాలిట మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ జర్నల్‌లో వారి పరిశీనలను పబ్లిష్ చేశారు.

ఆ కొత్త వైరస్‌ ఇదే:
జీ-4(G4).. ఇప్పుడు పరిశోధకులను కలవరానికి గురిచేస్తున్న వైరస్‌ ఇదే. కొత్త వైరస్ కు G4 అని పేరు పెట్టారు. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ జాతి నుంచే ఇది ఉద్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు. మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఈ వైరస్‌లో ఉన్నట్లు గుర్తించామని అధ్యయనంలో పాల్గొన్న చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు, చైనా ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం’(సీడీసీ) శాస్త్రవేత్తలు తెలిపారు.

కొత్త వైరస్ ను ఇలా గుర్తించారు:
2011 నుంచి 2018 మధ్య చైనాలోని పది ప్రావిన్సుల్లో ఉన్న వివిధ జంతు వధశాలలు, పశు వైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి దాదాపు 30వేల నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో తీసుకుంటున్నట్లుగా నమూనాలను పందుల ముక్కుల్లో నుంచే తీసుకున్నారు. అనంతరం వాటిపై పరిశోధనలు జరపగా.. దాదాపు 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైరస్‌లను కనుగొన్నారు. వీటితో ఫెర్రెట్‌(ferret) అనే ముంగిస జాతికి చెందిన జంతువుపై ప్రయోగాలు చేశారు. వైరస్‌లు సోకినప్పుడు మనుషుల్లో కనబడే లక్షణాలే దాదాపు ఫెర్రెట్‌లోనూ కనిపిస్తుంటాయి. అందుకే ఫెర్రెట్‌పై ప్రయోగాలు జరుపుతుంటారు. కొత్తగా కనుగొన్న వైరస్‌లన్నింటిలోకెల్లా జీ-4 వైరస్‌ ఫెర్రెట్‌లో ప్రమాదకర లక్షణాలు చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే మానవ కణాల్లోనే(human cells) ఇది వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు గమనించారు.

ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుందా:
పందులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే ప్రతి 10 మందిలో ఒకరికి ఈ కొత్త వైరస్‌ ఇప్పటికే సోకిందని అధ్యయనంలో తేలింది. వారిపై యాంటీబాడీ పరీక్షలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇలా మనుషులకు సంక్రమిస్తుండడం వల్ల మానవ శరీరంలో ఇది మరింత శక్తిమంతంగా వృద్ధి చెందేలా కాలక్రమంలో రూపాంతరం చెందే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా.. లేదా.. అన్న అంశంపై మాత్రం ఇంకా లోతైన పరిశోధన జరగాల్సి ఉంది. ఒకవేళ ఇలా జరిగితే కనుక సమీప భవిష్యత్తులో మరో మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణంగా వచ్చే ఫ్లూల వల్ల ఇప్పటికే మనుషుల్లో ఏర్పడ్డ రోగ నిరోధక శక్తి.. జీ-4 నుంచి కాపాడే అవకాశం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

జంతు పోషణ వల్ల పెరుగుతున్న ముప్పు:
మనిసి అవసరాలకు అనుగుణంగా జరుగుతున్న జంతు పోషణ వల్ల మనుషులకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేసిందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని పశువైద్య విభాగం అధిపతి జేమ్స్‌ వుడ్‌ అభిప్రాయపడ్డారు. కృత్రిమ పశుపోషణ వల్ల జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల(జూనోటిక్‌ డిసీజెస్-zonotic diseases‌) ముప్పు క్రమంగా పెరుగుతోందన్నారు. జూనోటిక్ సంక్రమణ అనేది ఒక పాతోజన్ ద్వారా జంతువు నుంచి మనిషికి వచ్చే వ్యాధి.

Read:అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 44,450 కేసులు

Related Posts