లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

సంస్కృతంలో న్యూజిలాండ్‌ ఎంపీ ప్రమాణ స్వీకారం

Published

on

New Zealand MP takes oath in Sanskrit గత నెలలో జరిగిన న్యూజిలాండ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్‌ గౌరవ్‌ శర్మ(33) తాజాగా ఆ దేశ పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, గౌరవ్​.. సంస్కృతంలో ప్రమాణం చేయడం విశేషం.



తొలుత న్యూజిలాండ్​ అధికారిక భాష మోరీలో ప్రమాణస్వీకారం చేసిన గౌరవ్​.. ఆ తర్వాత సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు. భారత్​- న్యూజిలాండ్​ సంప్రదాయానికి ఆయన ఇచ్చే విలువకు ఇది అద్దంపడుతోందని ఆ దేశంలోని భారత హైకమిషన్​ ట్వీట్​ చేసింది.



ఈ నేపథ్యంలో హిందీలో ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని ఓ నెటిజెన్​ గౌరవ్ ​ను ప్రశ్నించారు. నిజానికి తాను హిందీలోనే ప్రమాణస్వీకారం చేద్దామనుకున్నట్టు వెల్లడించారు ఆయన. కానీ హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ అభిప్రాయపడ్డారు.



హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన గౌరవ్‌ శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 20 ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ గౌరవ్‌ శర్మ గత నెలలో జరిగిన న్యూజిలాండ్‌ ఎన్నికల్లో అధికార లేబర్‌ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. లేబర్‌ పార్టీ నుంచి పోటీచేసి ప్రత్యర్థి టిమ్‌ మసిండోపై 4,425 ఓట్లు తేడాతో జయకేతనం ఎగురవేశారు.



ప్రజల కష్టాలపై గళమెత్తే శర్మ పలు దేశాల్లోని శరణార్థుల హక్కులకోసం పోరాడారు. 2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచారు. వారు నివాసాలు ఏర్పరుచుకునేందుకు తోడ్పాటునందించారు. కరోనా కాలంలో హామిల్టన్‌లో విశేష సేవలందించారు.

కాగా, న్యూజిలాండ్‌ ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.