Home » ఐసీసీకి కొత్త బాస్.. 6 నెలల గ్యాప్ తర్వాత!
Published
2 months agoon
By
vamsiఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐసిసికి కొత్త ఛైర్మన్ వచ్చేశారు. అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లే(Greg Barclay) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ICC అధ్యక్షుడిగా భారతదేశానికి చెందిన శశాంక్ మనోహర్ స్థానంలో గ్రెగ్ బార్క్ నియమితులు అవుతున్నారు. గ్రెగ్ బార్క్లే 2012 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శశాంక్ తర్వాత ఐసీసీకి రెండో స్వతంత్ర చైర్మన్ గ్రెగ్ కానున్నాడు.
ప్రస్తుత ఐసిసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాను ఓడించి గ్రెగ్ బార్క్లే ఈ స్థానాన్ని సాధించారు. శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన తర్వాతే ఖవాజా ఐసిసి యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఐసీసీ బోర్డులో న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధిగా ఉన్న బార్క్లే తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. మనోహర్ రెండేళ్ల పదవీ కాలం జులైతో ముగియగా.. అప్పటి నుంచి తాత్కాలిక ఛైర్మన్‌గా ఆ బాధ్యతలను ఇమ్రాన్ ఖవాజా నిర్వహిస్తున్నారు. చైర్మన్ పదవి కోసం ఖవాజా, గ్రెగ్ పోటీపడగా.. తొలి రౌండ్లో బార్క్లేకు 10 ఓట్లు, ఖవాజాకు 6 ఓట్లు పడ్డాయి. తర్వాతి రౌండ్లో దక్షిణాఫ్రికా బార్క్లేకు ఓటేయడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజార్టీ సాధించిన ఆయన చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు.
గ్రెగ్ బార్క్లే కూడా ICCలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొత్త పదవి రావడంతో తన పదవికి రాజీనామా చేయబోతున్నాడు. గ్రెగ్ బార్క్లే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో జరిగిన 2015వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌కు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు బార్క్లే సంతోషం వ్యక్తం చేశారు. ICC అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఎంతో గర్వకారణం అని ఆయన అన్నారు. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.
బార్క్లే ఇంకా మాట్లాడుతూ, “ICCలోని మొత్తం 104మంది సభ్యులతో కలిసి పనిచేయడంపై దృష్టి పెడతాను. చాలా క్లిష్ట సమయంలో క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ఖవాజాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మేము కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాను.”అని అన్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో గంగూలీకి కూడా అవకాశం ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.