మోడీకి రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు…నిర్మలాసీతారామన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

NIRMALA SITARAMAN ON FARM BILLS కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకున్న ఆమెకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్​, నూజివీడు సబ్ కలెక్టర్, ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకునే ముందు జక్కులనెక్కలం గ్రామంలో రైతులతో నిర్మలాసీతారామన్​ మాట్లాడారు. రైతుల పంట, గిట్టుబాటు ధర, మార్కెట్‌ పరిస్థితిపై నిర్మల ఆరా తీశారు. ఆమెకు రైతులు తమ బాధలు చెప్పుకొన్నారు. ధాన్యం, చెరకుకు గిట్టుబాటు ధర రావట్లేదని కొందరు.. పంట కొనుగోళ్ల గురించి మరికొందరు గోడు వెల్లబోసుకున్నారు. రైతుల సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం కోసమే… కేంద్రం చట్టం తెచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా తెలిపారు.


విజయవాడలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను అమరావతి మహిళా ఐకాస నేతలు కలిశారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని ఆమెను కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజధానుల మార్పు సరికాదని.. సీఎం జగన్‌ ఇప్పటికైనా అమరావతిపై తన తీరు మార్చుకునేలా కేంద్రం చొరవ చూపాలని ఐకాస ప్రతినిధులు కోరారు. ఐకాస నేతలతో మాట్లాడి భూములిచ్చిన రైతుల సమస్యలను కేంద్రమంత్రి‌ అడిగి తెలుసుకున్నారు.


మధ్యాహ్నాం విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్‌హాల్లో వ్యవసాయ బిల్లులపై వ్యవసాయరంగ నిపుణులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలాసీతారామన్…కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభమే తప్ప నష్టమే లేదన్నారు. మోడీకి రైతులు ధన్యవాదాలు చెబుతున్నారని ఆమె తెలిపారు. కొత్త అగ్రి చట్టాల ద్వారా రైతు దేశంలో ఎక్కడైనా తన పంట అమ్ముకోవచ్చన్నారు. రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. గతంలో రైతుకు వస్తున్న ఆదాయంలో 8శాతం వరకు పన్ను కట్టాల్సి వచ్చేదని,కొత్త వ్యవసాయ చట్టాలతో పన్నులు కట్టే బాధ రైతులకు తప్పుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం వరి,గోధుమకే కనీస మద్దతు ధర ఇచ్చిందని,మోడీ ప్రభుత్వం వచ్చాక 22రకాల పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇస్తోందని ఆమె తెలిపారు.

వ్యవసాయపరమైన చట్ట సవరణలపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందన్నారు. కొన్నిపార్టీలు కావాలనే పార్లమెంట్ లో ఈ చట్ట సవరణలపై గొడవలు చేశాయని తెలిపారు. చిన్న రైతులు సైతం ఈ-నామ్ డిజిటల్ వ్యవస్ధ ద్వారా ఎక్కడైనా తమ ఉత్పత్తులని సులువుగా అమ్ముకోవచ్చన్నారు. కోవిడ్ కి ముందు నాటి ఆర్ధిక పరిస్ధితులకి చేరుకుంటున్నాం. రాష్డ్రాలకి జీఎస్టీలోటు భర్తీపై ఈ నెల 12న మరోసారి రాష్డ్రాలతో సమావేశమం కానున్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు.

Related Tags :

Related Posts :