కరోనా వ్యాక్సిన్ సేకరణ చేయొద్దు, రాష్ట్రాలకు నీతి ఆయోగ్‌ నిపుణుల కమిటీ సూచన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం(ఆగస్టు 12,2020) ఢిల్లీలో సమావేశమైంది. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ కరోనా వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కీలకంగా చర్చించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు ఉండటంతో వ్యాక్సిన్ల లభ్యత, సరఫరా, చేరవేసే విధానం, పాటించాల్సిన విధివిధానాలు, మౌలిక సదుపాయాలపై నిపుణులు చర్చించారు. పలు సంస్థలు టీకా తయారీకి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఆయా సంస్థల్లో పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్లపై జాతీయ సాంకేతిక సలహా బృందం నుంచి వివరాలు కోరారు.

వ్యాక్సిన్‌ ప్రక్రియను ట్రాక్‌ చేయడానికి ఉన్న వ్యవస్థలపై కూడా నిపుణుల బృందం చర్చలు జరిపింది. దేశీయ, విదేశీ వ్యాక్సిన్ల సేకరణ, ప్రజలకు చేరువ చేయడానికి ప్రాధాన్యత మార్గదర్శకాలపై, ఆర్థిక వనరులపై నిపుణుల బృందం దృష్టి సారించింది. వ్యాక్సిన్‌ భద్రత, నిఘాకు సంబంధించి తలెత్తే సమస్యలపై కూడా కమిటీ సభ్యులు సమావేశంలో చర్చించారు. కాగా, రాష్ట్రాలు తమ మార్గాల ద్వారా టీకా సేకరణ చేయొద్దని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్‌ నిపుణుల బృందం సూచించింది.

కాగా, రష్యా చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ నిరాకరించింది. రష్యా వ్యాక్సిన్ ను ఇండియాకు దిగుమతి చేస్తారా? అన్న ప్రశ్నకు.. వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడం, తయారీకి అవసరమైన నిధులు, ఎన్ని డోసులు అవసరపడతాయి అనే విషయాలను చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అంతర్గత చర్చల ద్వారానే ముందడుగు వేస్తామని, ఈ విషయంలో అందరి అభిప్రాయాలనూ తీసుకుంటామని తెలిపారు.

కాగా, ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, కాడిలా హెల్త్ కేర్ వ్యాక్సిన్ లు తొలి దశను పూర్తి చేసుకుని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఈ రెండు సంస్థలూ స్వదేశీ పరిజ్ఞానంతోనే వ్యాక్సిన్ తయారు చేశాయి. ఇదే సమయంలో పుణె కేంద్రంగా నడుస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను ఇండియాలో నిర్వహిస్తోంది. ఈ టీకాల్లో దేని పని తీరు మెరుగ్గా ఉంటే, దాన్ని అందుబాటులోకి తెచ్చి, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఇవ్వాలన్నది ప్రభుత్వ అభిమతం.

Related Posts