Home » తిరుమల భక్తుల్లో భయం : విరిగిపడుతున్న కొండచరియలు
Published
2 months agoon
By
madhuNivar Cyclone Effect : తిరుమల రెండవ ఘాట్ రోడ్‌పై భయానకవాతావరణం నెలకొంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రెండు రోజులుగా నివార్ తుఫాన్ ధాటికి తిరుమల కొండపై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజుల నుంచి ఘాట్ రోడ్డుపై కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు విరిగి పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. అయితే 2020, నవంబర్ 27వ తేదీ శనివారం రెండవ ఘాట్ రోడ్‌పై మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు భక్తులు.
అయితే 2020, నవంబర్ 26వ తేదీ గురువారం కూడా తిరుమలలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. పాపవినాశనం వద్ద పలు చెట్లు నేలకూలాయి. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలి కొన్ని బైక్‌లు ధ్వంసమయ్యాయి. కనుమ మార్గంలోనూ కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. కారుపై బండరాయి పడటంతో.. భక్తులకు గాయాలయ్యాయి. వీరిని తిరుమల తరలించారు. బండరాళ్లను జేసీబీల సాయంతో తొలగించగా.. పాపవినాశనం వద్ద కూలిన వృక్షాలను అటవీశాఖ సిబ్బంది తొలగించారు.
తిరుమల కొండపై భారీ వర్షం కురుస్తుండడంతో.. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం నుంచి గదులకు చేరుకునే సమయంలో ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో తితిదే యంత్రాంగం అప్రమత్తమైంది. కనుమదారుల్లో భక్తులకు సూచనలు చేయడంతో పాటు.. కొండ చరియలు పడే ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ విభాగం అప్రమత్తమైంది.
మరోవైపు ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండడంతో తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో రెండేళ్ల పాటు తిరుమలకు నీటి కష్టాలు ఉండవని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.