Home » దూసుకొస్తోన్న నివార్ తుపాను… ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Published
2 months agoon
By
bheemrajNivar storm heavy rain : నివార్ తుపాను దూసుకొస్తోంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. పుదుచ్చేరికి 320 కిమీ, చెన్నైకి 450 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. రేపు రాత్రి కరైకల్-మహాబలిపురం మధ్య తీరం దాటనుంది.
తుపాను తీరం దాటే సమయంలో ఏపీలో తీరం వెంబడే 65 నుంచి 85 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం దాటే సమయంలో అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 26న రాయలసీమకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నివార్ తుపాన్ ప్రభావంతో చెన్నైలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎటు చూసినా కారు మబ్బులు కమ్ముకున్నాయి. పట్టపగలే చీకటైపోయింది. తమిళనాడులో ఇప్పటికే తుపాన్ ప్రభావం మొదలైంది. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి 110 నుంచి 120 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
నివార్ ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన. సైక్లోన్ ప్రభావంతో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నివార్ తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా నెల్లూరు జిల్లాకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి.