ఇబ్బందుల్లో నల్లగొండ బీజేపీ, రెండుగా చీలడం ఖాయమేనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

nizamabad bjp in troubles: నల్లగొండలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేదు. ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని రెండుగా చీల్చబోతుందని అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు తలెత్తిన వివాదం ఆ పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. ముఖ్య నేతలంతా రెండు వర్గాలుగా విడిపోయారని అంటున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా.. మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి నేతృత్వంలో మరో వర్గం అసమ్మతి సమావేశం నిర్వహించింది. దీనికి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకావడంతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. శ్రీధర్‌రెడ్డి నాయకత్వంలో తాము పని చేయలేమని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి అమీతుమీ తేల్చుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం.

నేతల మధ్య ముదిరిన విభేదాలు:
నల్లగొండ జిల్లాలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. అయినా నేతల మధ్య విభేదాలు ముదురు పాకానపడ్డాయి. కరోనా వ్యాప్తికి ముందు జిల్లా అధ్యక్షుడిగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్‌రెడ్డిని పార్టీ నియమించింది. రాష్ట్ర నేతలతో లాబీయింగ్‌ చేసి పదవి తెచ్చుకున్నారని అప్పట్లోనే ఆ పార్టీలోని మరో వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నేతకు అప్పుడే అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. సైద్ధాంతిక పునాదిగా పని చేసే పార్టీగా చెప్పుకునే బీజేపీలో అలా వచ్చి ఇలా అధ్యక్షుడయ్యే పరిస్థితులు దాపురించాయని ఆ పార్టీ నేతల అంతర్గత సంభాషణల్లోనూ చర్చకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అది అంతర్గతంగా రగులుతూ వస్తోంది.పార్టీలో పట్టుకోసం శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు:
మరోవైపు శ్రీధర్‌రెడ్డి కూడా పార్టీలో పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తన వర్గాన్ని పెంచుకునే దిశగా చర్యలు మొదలుపెట్టారు. ఇటీవల పార్టీ జిల్లా కార్యవర్గాన్ని నియమించారు. అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటుచేశారు. శ్రీధర్‌రెడ్డి నియమించిన పార్టీ కమిటీలపై మిగిలిన నేతలు భగ్గుమంటున్నారు. ఏళ్ల తరబడి ఎన్నో కష్ట నష్టాల కోర్చి పార్టీలో పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేయడం ఏమిటని పలువురు సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమను కాదని ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి, తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అంతా కారెక్కుతున్నారు, ఆ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి


కలకలం రేపిన ఆడియో టేప్:
ఇటీవల నల్లగొండకు చెందిన ఓ ముఖ్య నేతను.. మాజీ అధ్యక్షుడిని ఎందుకు కలిశావంటూ శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి అవతలి నేత కూడా దీటుగా సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో శ్రీధర్‌రెడ్డి వ్యతిరేక వర్గీయులంతా ఏకతాటిపైకి వచ్చారట. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని అంటున్నారు.

శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం:
శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా కనగల్‌ మండలం దర్వేశిపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఈ సమావేశానికి నేతృత్వం వహించారట. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మందికి పైగా సమావేశానికి హాజరు కాగా వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు ప్రసాద్‌, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పోతెపాక సాంబయ్య, పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ నక్క వెంకటేశ్‌, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఏటి కృష్ణ, యాస అమరేందర్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేతలతో పాటు అనుబంధ సంఘాల ముఖ్య నేతలు హాజరు కావడంతో వ్యవహారం రాజుకుంది.

శ్రీధర్‌రెడ్డి విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకోవాలని తీర్మానం:
దర్వేశిపురం సమావేశంలో ముఖ్య నేతలంతా శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా ధ్వజమెత్తినట్లు తెలిసింది. సమావేశంలో జరిగిన పలు అంశాలపై చర్చ బయటకు పొక్కింది. శ్రీధర్‌రెడ్డి విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారట. సొంత ప్రాంతమైన నాగార్జునసాగర్‌లోనూ పార్టీని కనీసం పట్టించుకో లేదని, జిల్లాలో పార్టీని ఎలా నడిపిస్తారన్న ప్రశ్నలు సంధించారు. ఆది నుంచి పార్టీలో పని చేస్తున్న నేతలను, కార్యకర్తలను అవమానించేలా ఆయన వ్యవహారశైలి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి పెత్తనం పెరిగిపోయిందన్న చర్చ:
పార్టీలోని సీనియర్‌ నేతలతో మాట్లాడినా, దగ్గరగా ఉన్నా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి పెత్తనం కూడా పెరిగిపోయిందన్న చర్చ జరుగుతోంది. పూర్తిగా ఒంటెద్దు పోకడలతో పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి భవిష్యత్‌ ఉండదని కూడా ఓ సీనియర్‌ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆలస్యమైంది.. ఇక సహించేది లేదంటూ తక్షణమే రాష్ట్ర ముఖ్యులను కలవాలని తీర్మానించారు. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో పాటు ఇతర ముఖ్యులను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

అయోమయంలో కేడర్:
అసమ్మతి నేతల కార్యాచరణపై శ్రీధర్‌రెడ్డి వర్గీయులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పార్టీలో మొదలైన ఈ రచ్చ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా అటువైపు దృష్టి సారించకుండా తమలో తామే పోట్లాడుకుంటుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఈ పరిణామాలు వరంగల్‌, ఖమ్మం జిల్లాల పార్టీ నేతలను కూడా కలవరానికి గురిచేస్తున్నాయట. మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ తామేనని చెబుతున్న నేతలకు ఈ పరిణామాలు మింగుడుపడడం లేదని టాక్.

Related Tags :

Related Posts :