Roman coins : 2వేల ఏళ్లనాటి రోమన్ చరిత్రను చాటి చెప్పిన బంగారు ‘నాణెం’..

తవ్వకాల్లో బయటపడే వస్తువులూ గతకాలపు ప్రాముఖ్యతను, అలవాట్లను కళ్లకు కడతాయి.. అలా దొరికిన ఓ బంగారు నాణెం కూడా చరిత్రలో కల్పితంగా మిగిలిపోయిన ఓ కథను నిజం చేసింది.. రోమన్‌ సామ్రాజ్య చరిత్రలో ఓ చక్రవర్తి చరిత్రను వెలుగులోకి తెచ్చింది..

Roman coins : 2వేల ఏళ్లనాటి రోమన్ చరిత్రను చాటి చెప్పిన బంగారు ‘నాణెం’..

Ancient Gold Coin Proves Fictional Roman Emperor Sponsian Was Real

Ancient Roman coins : రాళ్లపై బొమ్మలు.. ఇనుప పనిముట్లు.. పూర్వకాల చరిత్రను చెబుతాయి.. తవ్వకాల్లో బయటపడే వస్తువులూ గతకాలపు ప్రాముఖ్యతను, అలవాట్లను కళ్లకు కడతాయి.. అలా దొరికిన ఓ బంగారు నాణెం కూడా చరిత్రలో కల్పితంగా మిగిలిపోయిన ఓ కథను నిజం చేసింది.. రోమన్‌ సామ్రాజ్య చరిత్రలో ఓ చక్రవర్తి చరిత్రను వెలుగులోకి తెచ్చింది..

మొన్నటివరకూ కల్పితమే.. కాని ఇప్పుడది నిజమయింది.. చరిత్ర నిపుణులు సైతం కల్పితమని రాసిన రాతల్ని కొట్టిపారేస్తూ అది ఊహ కాదు నిజమేనంటూ నిరూపించింది ఓ బంగారు నాణెం.. చరిత్రలో కల్పిత పాత్రగా చెప్పుకున్న మూడో శతాబ్దపు ఒక రోమన్ చక్రవర్తి నిజంగానే ఉన్నారని ఒక పురాతన బంగారు నాణేం వల్ల రుజువు అయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యానికి సైనిక స్థావరంగా ఉండే ప్రాంతం ట్రాన్సిల్వేనియా.. 300 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ నాణేం లభ్యమైంది. అది నకిలీదని భావించి దాన్ని మ్యూజియంలోని అల్మారాలో ఉంచారు. అయితే ఆ నాణెంపై 19వ శతాబ్ధంలో చరిత్ర నుంచి కనుమరుగు అయిన స్పాన్సియన్ చక్రవర్తి ముఖచిత్రం ఉంది.. ఇది 2వేల ఏళ్ల క్రితం చెలామణిలో ఉండేదని నాణేన్ని మైక్రోస్కోపులో చూస్తే కనిపించే గీతలు రుజువు చేస్తున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

1713లో ఈ నాణేన్ని కనుగొన్నప్పటికీ.. నకిలీ నాణెంగా భావించి 1863లో దాన్ని అపూర్వ వస్తువుల జాబితా నుంచి తొలగించారు. రోమన్‌ సామ్రాజ్య చరిత్ర పుస్తకం గురించి పరిశోధిస్తుండగా.. ఈ నాణెం ఫోటోలు కనబడటంతో దీనిపై దృష్టి పెట్టారు శాస్త్రవేత్తలు. చెలామణిలో ఉన్నప్పుడే నాణెంపై ఉన్న గీతలు పడి ఉంటాయని అనుమానించారు… మైక్రోస్కోపు నుంచి చూసి అదే జరిగి ఉండొచ్చని నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆ స్పాన్సియాన్ ఎవరు అన్న కొత్త ప్రశ్న మొదలైంది..

స్పాన్సియాన్… రోమన్ సామ్రాజ్యంలోని అత్యంత కష్టతరమైన డాసియా అనే ప్రావిన్సుకు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ఒక మిలిటరీ కమాండర్ అని పరిశోధకులు భావిస్తున్నారు. క్రీ.శ 260 కాలంలో రోమన్ సామ్రాజ్యం నుంచి డాసియా ప్రావిన్సుకు సంబంధాలు తెగిపోయినట్లు పురాతత్వ అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక మహమ్మారి విజృంభించడంతో పాటు, అంతర్యుద్ధం కారణంగా ఆ సామ్రాజ్యం చిన్నాభిన్నమైంది. రోమన్ సామ్రాజ్యం నుంచి దూరం కావడంతో పాటు శత్రువులు చుట్టుముట్టడం, అంతర్యుద్ధం వంటి గందరగోళ పరిస్థితుల్లో డాసియా పౌరులను, మిలిటరీని కాపాడేందుకు స్పాన్సియాన్ తనంతట తానుగా చక్రవర్తి పీఠాన్ని అధిష్టించాడని పరిశోధకులు చెబుతున్నారు.. క్రీ.శ 271- 275 మధ్య కాలంలో డాసియా ప్రావిన్సు ఖాళీ అయినట్లు తెలిపారు.

రోమన్ సామ్రాజ్యపు నాణేలతో పోలిస్తే ఈ నాణేలు ఎందుకు భిన్నంగా ఉన్నాయో ఈ సిద్ధాంతం వివరిస్తోంది. ఆ నాణేలు ప్రామాణికమైనవే అని గుర్తించిన తర్వాత పరిశోధకులు ట్రాన్సిల్వేనియాలోని సిబియులో ఉన్న బ్రూకెంతల్ మ్యూజియం పరిశోధకులను అలర్ట్‌ చేశారు. ఆ మ్యూజియంలో కూడా స్పాన్సియన్ నాణేం ఉంది. అయితే అది ట్రాన్సిల్వేనియా హాబ్స్‌బర్గ్ గవర్నర్ బరోన్ శామ్యూల్ వోన్ బ్రూకెంతల్‌కు చెందినది.