UP Lineman : పోలీసులపై లైన్‌మెన్ ఆగ్రహం .. ఎస్పీ సహా పోలీసులందరికి చెమటలు పట్టించేశాడుగా..!

విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన మెన్ కు పోలీసులపై పట్టరాని కోపమొచ్చింది. మీకు చెమటలు పట్టించకపోతే నేను లైన్ మెన్ నే కాదనుకున్నాడు. ఆ తరువాత అతని కోపానికి జిల్లా ఎస్పీతో సహా జిల్లా పోలీసులందరికి చెమటలు పట్టాయి. ఇంతకూ అతనేం చేశాడంటే..

UP Lineman : పోలీసులపై లైన్‌మెన్ ఆగ్రహం .. ఎస్పీ సహా పోలీసులందరికి చెమటలు పట్టించేశాడుగా..!

UP Lineman fire On Police

UP Lineman : తనకు జరిమానా వేసిన పోలీసులపై ఓ లైన్‌మెన్ వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. టూ వీలర్ పై ప్రయాణిస్తే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం తప్పకుండా పాటించాల్సిన నిబంధన. వాహనదారుల భద్రత కోసం తీసుకొచ్చిన నిబంధన. కానీ ఉత్తరప్రదేశ్లోని మీటర్ కు చెందిన ఓ లైన్‌మెన్ హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నందుకు పోలీసులు జరిమానా వేశారు.

 

దీంతో సదరు లైన్‌మెన్ కు కోపమచ్చింది. మీకు అధికారం ఉంది కాబట్టి మీరు నాకు జరిమానా వేశారు.మీరు చేయాల్సింది మీరు చేశారు. నేను చేయాల్సింది నేను కూడా చేస్తా అంటూ ఉడుక్కున్నాడు.అంతటితో ఊరుకున్నాడా? ఏకంగా జిల్లా ఎస్పీతో సహా మొత్తం పోలీసులు కుటుంబాలకు చెమటలు పట్టించేశాడు.దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులకు చెమటలు పట్టించిన ఆ లైన్ మెన్ ఏం చేశాడంటే..

 

మీరట్ కు చెందిన ఖలీద్ అనే వ్యక్తి లైన్‌మెన్ గా పనిచేస్తున్నాడు. ధీర్ఖెడా ప్రాంతానికి చెందిన ఖలీద్ డ్యూటీలో భాగంగా పనిమీద ఇటీవల హాపూర్‌కు బైక్‌పై వచ్చాడు. కానీ హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో పోలీసులు అతనికి చలానా వేశారు.తాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నానని డ్యూటీ మీద ఇక్కడికి వచ్చానని చెప్పాడు.అయినా రూల్స్ అందరికి ఒక్కటే చలానా కట్టాల్సిందేనన్నారు పోలీసులు. రూ.1000ల చలానా విధించారు. దీంతో ఖలీద్ కు కోపం ముంచుకొచ్చింది.

 

ఆ కోపం తారాస్థాయికి వెళ్లింది. దీంతో ఖలీద్ స్థానికంగా కరెంటు సరఫరా నిలిపివేశాడు. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడికి ఉక్కపోతతో అల్లాడిపోయారు పోలీసులు. పోలీసు క్వార్టర్స్ కు కూడా విద్యుత్ కట్ చేశాడు. జిల్లా ఎస్పీ సహా అనేక మంది పోలీసులు..వారి కుటుంబాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖలీద్ కరెంట్ స్తంభం ఎక్కుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలీద్ కరెంట్ స్థంభం ఎక్కిన కాసేపటికే అంతా అంథకారం అలుముకుంది. కానీ ఖలీద్ చేసిన ఈ పనిపై విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ స్పందించలేదు.