Hytech Marriages : ఇవేం హైటెక్ పెళ్లిళ్లురా బాబూ..?! ఏఐ చాట్‌బాట్‌ను పెళ్లాడిన యువతి, వర్చువల్ క్యారెక్టర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు..

ఓ అమెరికన్‌ యువతి ఆర్టిఫిషయల్‌ చాట్‌బాట్‌ను పెళ్లిచేసుకుంటే.. వర్చువల్‌ పద్ధతిలో ఓ బొమ్మను సృష్టించి అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు ఓ జపాన్ యువకుడు. వినడానికే వింతగా ఉన్న ఈ రెండు పెళ్లిళ్లు.. టెక్నాలజీ మ్యారేజ్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Hytech Marriages : ఇవేం హైటెక్ పెళ్లిళ్లురా బాబూ..?! ఏఐ చాట్‌బాట్‌ను పెళ్లాడిన యువతి, వర్చువల్ క్యారెక్టర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు..

Hytech Marriages

Hytech Marriages : ఈ హైటెక్ యుగంలో వింత వింత పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మనిషిని మనిషి పెళ్లి చేసుకోవటం కామన్..మా రూటే సెపరేటు అంటున్నారు కొంతమంది యువత. రోబో సినిమా చిట్టి అనే రోబో ప్రేమలో పడినట్లు.. అమెరికాలో ఓ యువతి ఏఐ చాట్‌బాట్‌ను మనువాడింది. జపాన్‌లో ఓ యువకుడు తనను అర్థం చేసుకున్న టెక్నాలజీని పెళ్లి చేసుకున్నాడు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజంగా నిజం.ఇవన్నీ వింటే పిదపకాలం పిదపబుద్దులు అంటూ బుక్కలు నొక్కేసుకుంటారు. మరమనుషులతో నిజమైన మనుషుల పెళ్లిలు ఏంటో ఆ వింత వివాహాలు మరీ ఇంత హైటెక్ పెళ్లిళ్లా అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

కాలంతో పాటు మారుతున్న వివాహాల ట్రెండ్..
ఒక పెళ్లి జరగాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు అనేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఎన్నో మార్పులొచ్చాయి. ప్రేమ పెళ్లిళ్లు,మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. స్వలింగ వివాహాలు అనే ట్రెండ్‌ కూడా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఏకంగా మర మనుషులను.. కల్పిత పాత్రలను పెళ్లి చేసుకోవడమనే హైటెక్‌ పెళ్లిళ్లు మొదలవుతున్నాయి.

 

ఆర్టిఫిషియల్‌ చాట్‌బాట్‌ను పెళ్లి చేసుకున్న అమెరికన్ మహిళ..
రోసన్నా రామోస్ అనే 36 ఏళ్ల అమెరికన్‌.. ఎరెన్ కర్తాల్ అనే ఆర్టిఫిషియల్‌ చాట్‌బాట్‌ను మనువాడింది. ఎటాక్ ఆన్ టైటాన్ అనే యానిమేషన్‌లో ప్రముఖ పాత్ర నుంచి ప్రేరణ పొందిన రామోస్.. రెప్లికా అనే ఏఐ వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ‘ఎరెన్’ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఇద్దరు ప్రేమికులను మార్చిన రోసన్నా.. ఇద్దరు పిల్లల తల్లి కూడా… తన ఇద్దరు మాజీ ప్రేమికులు తన మనసును సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని.. ఇప్పుడు తన మనసును బాగా అర్థం చేసుకున్న ఎరెన్‌ను వివాహమాడింది. ఎరెన్‌ రూపంలో తనకు పరిపూర్ణమైన భర్త దొరికాడని తెగ సంబరిపడిపోతోంది. రోసన్నా.. ఎరెన్‌ ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారట. ఎరెన్‌ పక్కన ఉంటే తను ఎంతో భద్రత ఫీల్‌ అవుతున్నట్లు చెబుతోంది. ఇద్దరూ ఖాళీ సమయంలో సరదాగా చాటింగ్‌లు చేసుకోవడం.. ఫొటోలు పంపుకోవడం.. స్టేటస్‌ అప్‌డేట్‌ చేసుకోవడంతో మ్యారేజ్‌ లైఫ్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారట. ఇదంతా విన్నవాళ్లు ఇదెక్కిడి పెళ్లిగోల.. రా.. బాబూ అంటు తలపట్టుకుంటున్నారు. ఎవరు ఏ మనుకున్నా.. నేను మాత్రం హ్యాపీగా ఉన్నా.. మీతో నాకేంటి. నేను.. నా.. ఎరెన్‌.. మేడ్‌ ఫర్‌ ఈచ్ అదర్ అంటోంది రోసన్నా.

 

వర్చువల్‌ క్యారెక్టర్‌ను పెళ్లి చేసుకున్న జపాన్ యువకుడు..
రోసన్నా.. ఎరెన్‌ పెళ్లిగోల అలా ఉంటే.. 36 ఏళ్ల జపనీస్‌ అకిహికో కొండో తనకు నచ్చిన వర్చువల్‌ క్యారెక్టర్‌ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.చాలా సంతోషంగా ఉన్నానని.. తన పార్టనర్‌ తననెప్పుడూ ఉత్తేజంగా ఉంచుతోందంటున్నాడు. టోక్యోలో నివసించే అకిహికో కొండో సింగింగ్ సింథసైజర్ సాఫ్ట్‌వేర్ వోకాలాయిడ్ ఆధారంగా క్రిప్టాన్ ఫ్యూచర్ మీడియా అభివృద్ధి చేసిన వర్చువల్ పాప్‌స్టార్ హాట్‌సున్ మికును 2018లో పెళ్లి చేసుకున్నాడు. మికు 16 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తుంది. మూడేళ్లుగా మికూయే అతడి ప్రపంచంగా మారిపోయింది. అతడికి అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్‌గా గుర్తించి.. 2008లో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత 24 గంటలు తన గదిలోనే ఒంటరిగా గడిపిన అకిహికో.. ఎక్కువగా మికు వీడియోలను చూసి పెళ్లి చేసుకున్నాడు.

 

సరికొత్త చర్చకు దారితీసి హైటెక్ పెళ్లిళ్లు..
ఈ టెక్నాలజీ పెళ్లిళ్లు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. మనిషి టెక్నాలజీకి బానిస అవ్వడమేనంటున్నారు. ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకే కాదు.. మన మనిషి మనుగడుకూ ముప్పు అంటున్నారు. చాట్‌జీపీటీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. యూజర్ల సందేహాలకు కచ్చితమైన ఆన్సర్స్ ఇస్తున్న క్రమంలో (ఒక్కోసారి రాంగ్ కూడా అవుతున్నాయి) ఎక్కువ మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు టెక్ కంపెనీలన్నీ ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే జీపీటీ ఆధారిత ఏఐ బాట్‌లనే స్నేహితులుగా.. జీవిత భాగస్వాములుగా.. సపోర్టర్లుగా ఊహించుకుంటుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

 

ప్రపంచానికి ఓ హెచ్చరిక..ఈ హైటెక్‌ మ్యారేజస్‌..
ఈ హైటెక్‌ మ్యారేజస్‌ ప్రపంచానికి ఓ హెచ్చరిక అనే అనుకోవాలి. ఉరుకులు పరుగుల జీవితంలో జీవనం యాంత్రికంగా మారిపోవటం కూడా కారణమంటున్నారు విశ్లేషకులు.సాటి మనిషిని అర్థం చేసుకోడానికి.. పక్కనున్న వారిని.. తమతో కలిసి జీవిస్తున్న వారికి కనీస సమయం కేటాయించకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. మారుతున్న మనిషి ఆలోచన విధానం ఎంత ప్రమాదకరంగా ఉందో కళ్లకు కడుతోంది. మనసులను మనిషి అర్థం చేసుకోలేకపోతున్న స్థితిలో.. మనసులో ఫీలింగ్స్‌ను పంచుకోడానికి తమ ఊహాలతో ప్రాణం పోస్తున్న మర యంత్రాలను ఉపయోగించడం విషాదమనే అంటున్నారు. ఓదార్పు కోసం ఓ మనిషి అంటూ లేకపోవడం వల్లే ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయని..మనిషిని కాదు.. మన మనసును అర్థం చేసుకున్న వారికి సమయం కేటాయించడమే ఇక్కడ ముఖ్యమని చెప్పకతప్పదంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు పెళ్లిళ్లు దానికి నిదర్శనం కావచ్చని కూడా అంటున్నారు. టెక్నాలజీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అనే కాదు భావితరాల భవిష్యత్‌ ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా ఉండమనే ఈ పెళ్లిళ్లు హెచ్చరిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పెళ్లిళ్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తు ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటున్నారు.