Worlds Deepest Hotel : భూగర్భంలో హోటల్ .. అక్కడికెళ్లాలంటే సాహస యాత్ర చేయాల్సిందే..

ఆకాశంలో హోటల్ గురించి విన్నాం. సముద్రంలో హోటల్ ని చూశాం. ఇక భూమ్మీద ఉండే హోటల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కానీ భూగర్భంలో హోటల్ అందాలు..అక్కడి అనుభూతి గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి.

Worlds Deepest Hotel : భూగర్భంలో హోటల్ .. అక్కడికెళ్లాలంటే సాహస యాత్ర చేయాల్సిందే..

Worlds Deepest Hotel

Worlds Deepest Hotel : ఆకాశంలో హోటల్ గురించి విన్నాం. సముద్రంలో హోటల్ ని చూశాం. ఇక భూమ్మీద ఉండే సాధారణ, లగ్జరీ హోటల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కానీ భూగర్భంలో హోటల్ గురించి బహుశా విన్నారా? భూగర్భంలో హోటల్ అంటేనే ఓ వింత..పైగా ఈ హోటల్ కు వెళ్లాలంటే కూడా ఏదో అషామాషీ కాదండోయ్..సాహసయాత్రే చేయాలి..

భూగర్భంలో ఉండే ఈ హొటల్ 400 మీటర్లకు అంటే 1375 అడుగులు పైగా లోతులో ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉండే హోటల్ గా గుర్తింపు పొందింది. దాని పేరు ‘ది డీప్‌ స్లీప్‌ హోటల్‌ (Deep Sleep Hotel). ఈ హోటల్ కు వెళ్లాలంటే అంత ఈజీ కాదు. గనులు, బండరాళ్ల వెంట ట్రెక్కింగ్ చేయాలి. దారిలో పురాతన వంతెనల్ని దాటాలి. మెట్ల బావులు దాటుకుంటూ..అత్యంత కఠిన దారుల వెంట ప్రయాణించి అతి కష్టంగా ఈ హోటల్ చేరుకోవాలి..ఇంత కష్టమెందుకురా బాబూ అంటే ఈ భూగర్భంలో ఉండే ఈ హోటల్ లో ఉండే ప్రత్యేకతల్ని చూడటం మిస్ అయిపోతారు.

ఇంతకీ ఈ భూగర్భ హోటల్ ఎక్కడుందిరా బాబూ వింటేనే ఆయాసం వస్తోంది ఇకనైనా చెప్పండి ఎక్కుడుందో అని అనుకుంటున్నారా? బ్రిటన్‌ నార్త్‌ వేల్స్‌లోని ఎరారీ నేషనల్‌ పార్క్‌లోని స్నోడోనియా పర్వతాల కింద 400 మీటర్లకు పైగా లోతులో ఈ హోటల్‌ను నిర్మించారని చెప్పాల్సిందే. ఎరారీ నేషనల్‌ పార్క్‌లో పర్వతాల కింద 1375 అడుగులుపైగా లోతులో ఉండే ఈ హోటల్ లో రూములు, క్యాబిన్ల వంటివి లైట్ల వెలుతురులో భలే ఉంటాయి… వింత అందంతో కనువిందు చేస్తాయి. ఇంత కష్టపడి ప్రయాణించి ఈ హోటల్ కు చేరుకుంటే అక్కడి సెటప్ చూస్తే అలసట అంతా మర్చిపోతారు.

డీప్ స్లీప్ హోటల్‌లో రెండు పడకలతో నాలుగు ప్రైవేటు క్యాబిన్‌లు, డబుల్ బెడ్‌తో ఒక ప్రత్యేక గుహను రూముల్లా తీర్చిదిద్దారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అద్దెకు తీసుకోవచ్చు. వారానికి ఒకసారి మాత్రమే తెరిచి ఉంటుందట.. ప్రైవేటు క్యాబిన్‌లో ఇద్దరి బసకు 350 పౌండ్లు (రూ.36 వేలు), గుహ గదికిగానూ 550 పౌండ్లు (రూ.56 వేలు) చెల్లించాల్సిందే. వెజ్,నాన్ వెజ్ ఆహారాలతో పాటు వీగన్ ఆహారాలు కూడా అందుబాటులో ఉంటాయి.

 

పెద్దలతో పాటు 14 సంవత్సరాల మించితేనే పిల్లలను అనుమతిస్తారు ఈ హోటల్ కు. ఈ హోటల్ లో 10డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. క్యాబిన్లలో వెచ్చగా..హాయిగా పడుకోవచ్చు. ఇంత లోతైన హోటల్ కు వెళ్లటం అక్కడ స్టే చేయటం,అక్కడ ఆహారం తినటంలో ఓ చక్కటి అనుభూతినిస్తుందంటున్నారు నిర్వాహకులు.

 

ఈ హోటల్‌లో బస చేయాలనుకునేవారు ముందుగా ట్రిప్ లీడర్‌ వెంట పాడుబడిన విక్టోరియన్ బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్ చేయాలి. మెట్ల బావులు, పాత వంతెనలు దాటుకుంటూ.. కఠిన మార్గాల్లో గంటపాటు ప్రయాణించాలి. అలా ప్రయాణించాక ఒక పెద్ద ఇనుప డోర్ ఎంటరవుతుంది. ప్రయాణ మార్గంలో అతిథులకు హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులు సమకూరుస్తారు. ఈ హోటల్‌లో గడిపినవారు తమ జీవితంలోనే మంచి నిద్రను పొందామని చెబుతున్నారు.