దయచేసి ట్రాన్స్‌ఫర్ చేయండి.. రాజోలులో భయంతో వణికిపోతున్న అధికారులు, సిబ్బంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్‌ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఒత్తిళ్ళకు గురి చేయడమే దీనికి కారణమంటున్నారు. విపక్షాల మాట ఎలాగున్నా అధికార పార్టీలో కూడా మూడు వర్గాలు ఉండటంతో ఏ పని చేయాలన్నా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు.

అనధికార వైసీపీ ఎమ్మెల్యేగా రాపాక:
జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెలల వ్యవధిలోనే అధికార వైసీపీకి సానుభూతిపరునిగా మారిపోయారు. వైసీపీ కండువా కప్పుకోకపోయినా కార్యకర్తలా మారిపోవడంతో జనసేన కూడా ఆయనను దూరం పెట్టిందంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజోలు నియోకవర్గంలో అనధికార వైసీపీ ఎమ్మెల్యేగా రాపాక చలామణి అవుతున్నారని అంటున్నారు.

రాపాక, బొంతు, అమ్మాజీ వర్గాల మధ్య విభేదాలు:
తాను ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారనే ప్రచారం జరగుతోంది. నియోజకవర్గంలో బొంతు పెత్తనం ఎక్కువ కావడంతో ఆయనకు చెక్ చెప్పేందుకు పార్టీ అధిష్టానం తుని నియోజకవర్గానికి చెందిన మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీకి బాధ్యతలు అప్పగించింది. దీంతో అధికార పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడమే కాకుండా నువ్వా నేనా అని బహిరంగంగానే కొట్టుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో రాపాక, బొంతు, అమ్మాజీల వర్గాల విభేదాలు పెరిగిపోయి అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

అయోమయంలో అధికారులు:
విపక్ష పార్టీల మాట ఎలాగున్నా అధికార పార్టీలో మూడు వర్గాలు ఏర్పడటంతో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టాక్. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరిని పిలవాలి? ఏ ప్రొటోకాల్ ఫాలో అవ్వాలో తెలియక అధికారులు తికమక పడుతున్నారని అంటున్నారు. ప్రతి పనికి మూడు వర్గాల నుంచి పైరవీలు, సిఫారసులతో పాటు ఒత్తిళ్లకు గురి చేయడంతో ఎవరికి ఎస్ చెప్పాలి? ఎవరికి నో చెప్పాలి? తెలియక అయోమయంలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారని చెబుతున్నారు.

ప్రతీ చిన్న పనికి మూడు వర్గాల నుంచి సిఫారసులు:
2020 ఫిబ్రవరిలో జరిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు కమిటీల ఏర్పాటు విషయంలోనూ బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీ పోటీ పడ్డారు. దీంతో పార్టీ అధిష్టానం కలుగజేసుకొని ఎలాంటి కమిటీ లేకుండానే పోలీసుల పర్యవేక్షణలో కళ్యాణోత్సవాలు నిర్వహించాల్సి వచ్చింది. మలికిపురం మండలంలో అయితే అధికారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంని టాక్. ప్రతీ చిన్న పనికి మూడు వర్గాల నుంచి సిఫారసులు రావడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

ఇద్దరు అఫీషియల్ ఎమ్మెల్యేలు, ఇద్దరు అన్ అఫీషియల్ ఎమ్మెల్యేలతో ఇబ్బందులు:
మామిడికుదురు మండలంలో అధికారులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ఈ మండలం రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఉండడంతో ఇద్దరు అఫీషియల్ ఎమ్మెల్యేలు, ఇద్దరు అన్ అఫీషియల్ ఎమ్మెల్యేలతో అధికారులు నలిగిపోతున్నారని అంటున్నారు. టీడీపీ మాట ఎలా ఉన్నా జనసేన కార్యకర్తల నుంచి అధికారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేసినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా జనసేన కార్యకర్తలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని అంటున్నారు. అధికారులు, నాయకులు నిర్లక్ష్యంపై సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. దీంతో జనసేన కార్యకర్తలకు కూడా అధికారులు భయపడాల్సి వస్తోంది.

READ  పుల్వామా దాడిలో కొత్త నిజాలు...వర్చువల్ సిమ్ లు వాడారు

ట్రాన్స్‌ఫర్‌ చేయించేసుకుంటే బెటర్‌ అనుకుంటున్న అధికారులు:
అంతర్వేది రథం దగ్ధం ఘటన తరువాత అధికారులు మరింత భయపడిపోతున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుల ట్రయాంగిల్ పాలిటిక్స్‌లో ఎవరు చెప్పింది చేయాలో? ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక నియోజకవర్గం పరిధి నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించేసుకుంటే బెటర్‌ అనుకుంటున్నారని టాక్‌. అక్కడి రాజకీయాలను తెలుసుకున్న ఇతర మండలాల అధికారులు కనీసం అటువైపుగా కూడా కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. హాయిగా ఉన్న ప్రాణానికి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని దూరంగా జరిగిపోతున్నారట. మరి అధిష్టానం ఈ వర్గ రాజకీయాలకు ఎలా చెక్‌ పెడుతుందో? తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందోనని అధికారులు ఎదురుచూస్తున్నారు.

Related Posts