రూ.10వేలు కడితే రూ.26వేలు మీవే.. 7 నెలల్లోనే రూ.85 కోట్లు వసూలు.. నెల్లూరు జిల్లాలో భారీ మోసం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

online deposits scam: మోసపోవడానికి మనం రెడీగా ఉంటే చాలు.. మోసం చేయడానికి క్యూలో నిలబడి మరీ వస్తారు. జనం మైండ్ సెట్ మారనంత కాలం.. ఈ కేటుగాళ్ల దందా మారదు. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిపైనే తమ కన్నింగ్ బిజినెస్ నడిపిస్తుంటారు. మల్టీలెవెల్ మార్కెటింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు చెప్పి.. కోట్లలో దోచుకుంటున్నారు. ఇప్పుడు.. నెల్లూరు జిల్లాలో మరోసారి అలాంటి భారీ మోసమే బయటపడింది.

ఆన్‌లైన్ ట్రేడింగ్ మనీ స్కీం పేరుతో రూ.85కోట్లు వసూలు:
నెల్లూరు జిల్లాలో.. ఈ మధ్య మనీ స్కీమ్‌లు వరుసగా బయటకొస్తున్నాయ్. లోన్ల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో జనాలకు టోకరా వేస్తున్నారు. తాజాగా మరో భారీ మనీ స్కామ్‌ను పోలీసులు బయటపెట్టారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ మనీ స్కామ్‌ పేరు చెప్పి.. 10 వేలు కడితే.. వంద రోజుల్లో దాదాపు 26 వేలు చెల్లిస్తామని నమ్మబలికారు. జనాల నుంచి 85 కోట్ల దాకా వసూలు చేశారు.

7 నెలల్లోనే 12వేల 600మంది పెట్టుబడులు:
నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్‌లోని రిత్విక్ ఎన్‌క్లేవ్‌లో.. వేదాయపాలెంకు చెందిన మైకేల్ సుమన్, కర్నూలుకు చెందిన రవి, శ్రీను.. వెల్ పే అనే ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రజల దగ్గర్నుంచి.. భారీగా ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టించారు. మరుసటి రోజు నుంచి.. వారు పెట్టిన పెట్టుబడుల్లో 2శాతం నగదు చెల్లిస్తూ.. నమ్మకం కలిగించారు. కేవలం 7 నెలల్లోనే.. 12 వేల 6 వందల మంది ఈ వెల్ పే ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. దాదాపు 85 కోట్ల మేర లావాదేవీలు జరిపారు.

అనుమానం రావడంతో బయటపడిన మోసం:
తక్కువ సమయంలోనే.. తమ డబ్బులు రెట్టింపు అవుతాయని.. చాలామంది పెట్టుబడులు పెట్టి ఐడీలు తీసుకున్నారు. ఐతే.. పబ్లిక్ డిపాజిట్ చేసిన డబ్బులతో.. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేయకపోవడం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడంతో.. కొందరు డిపాజిటర్లకు అనుమానం వచ్చింది. పైగా.. ఈ బిజినెస్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు తీగంతా లాగడంతో.. మొత్తం విషయమంతా బయటకొచ్చేసింది. వెల్ పే ఆన్‌లైడ్ ట్రేడింగ్‌ సంస్థకు సంబంధించిన ముగ్గురు నిర్వాహకులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర్నుంచి.. కోటి 29 లక్షల నగదు, 5 ల్యాప్ టాప్స్, ఒక కారు, ఐదు మొబైల్స్, ప్రెస్ ఐడీ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కేటుగాళ్లను.. అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.

6వేలు డిపాజిట్ చేస్తే లక్ష లోన్:
దీనికంటే ముందు.. కాపిటల్ ట్రీ పేరుతో మరో సంస్థ ప్రజలను నిలువునా ముంచింది. లోన్ కావాలా అని కాల్ చేసి.. 6 వేలు డిపాజిట్ చేస్తే ప్రముఖ బ్యాంక్ నుంచి మీకు లక్ష లోన్ వస్తుందని నమ్మించారు. నెలకు.. ఎంత కట్టుకోవాలనేది మీ ఇష్టం అంటూ బురిడీ కొట్టించారు. పాన్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ డీటైల్స్ తీసుకొని.. నిజంగానే లోన్ ప్రాసెస్ చేసినట్లు బిల్డర్ ఇచ్చారు. 6 వేలు డిపాజిట్ కట్టాక.. లోన్ సంగతి పట్టించుకోరు. ఇలా.. దాదాపు 50 మంది దాకా మోసపోయారు. బాధితులు ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో.. కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

READ  ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

హిమ్, న్యూవిజన్, అగ్రిగోల్డ్.. మనీ స్కీమ్ ల పేరుతో మోసాలు:
వీటికంటే ముందు హిమ్, న్యూవిజన్, అగ్రిగోల్డ్ లాంటి రకరకాల మనీ స్కీంలు.. ఇప్పటికే ప్రజల నెత్తిన వందల కోట్ల మేర టోపీ పెట్టాయి. వీటికి సంబంధించి.. అనేక మందిపై కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది బాధితులు.. తమ డబ్బు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. సామాన్య జనంలో ఇంకా ఆశ చావడం లేదు. అందుకే.. ఇలాంటి మోసపూరిత స్కీమ్‌లను గుడ్డిగా నమ్మేస్తారు. తీరా మోసపోయాక.. షాక్ అవుతున్నారు.

నెల్లూరు జిల్లాలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఆన్ లైన్ ట్రేడింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు నిఘా పెడితే.. మరిన్ని మోసాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related Posts