Updated On - 11:47 am, Tue, 19 January 21
ORR Speed Rules: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న వాహనం ఫిక్స్డ్ లైన్లలో, ఫిక్స్డ్ స్పీడ్ తో వెళ్తుందా.. లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదంటే మీకు భారీ జరిమానా తప్పదన్నట్లే. గతంలో ఉన్న రూల్స్ ను కఠినతరం చేస్తూ పోలీసులు మరోసారి నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీఏ అధికారులు గంటకు 120కిలోమీటర్ల వేగాన్ని ఫిక్స్ చేయగా.. ఇప్పుడు దానిని రివైజ్ చేస్తూ.. 100కిలోమీటర్లకు మించి ప్రయాణించకూడదంటూ కండిషన్స్ పెట్టారు.
ఓఆర్ఆర్ నిబంధనల ప్రకారం.. ఫోర్ లైన్ హైవేపై గంటకు 100కిలోమీటర్లుగా, రెండు వరుసల్లో ఉండే హైవేపై గంటకు 80కిలోమీటర్ల వేగం మించి ప్రయాణించకూడదు. మొదటి రెండు వరుసల్లో వెళ్లే కార్లు గంటకు 80కిలోమీటర్లకు మించకుండా ప్రయాణించాలి. మిగిలిన రెండు వరుసల్లో గూడ్స్ లారీలు వెళ్లేలా రోడ్ ను డిజైన్ చేశారు. చాలా మంది వెహికల్ నడిపేవాళ్లు అవగాహన లేక ఫోర్ లైన్ మొత్తంలో ఏ వరుసలో అయినా 100కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంటారు.
వారికి అవగాహన కల్పించేవిధంగా సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో పోస్టుల ద్వారా విషయం తెలియజేస్తున్నారు. ఇకపై మొదటి రెండు వరుసలు 100కిలోమీటర్లు చివరి రెండు లైన్లు గంటకు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. రూల్స్ బ్రేక్ చేసి వేగం పెంచితే స్పీడ్ లేజర్ గన్స్ ఫొటోలు తీసి పంపిస్తాయి. వాటిని సాక్ష్యంగా చూపిస్తూ రూ.వెయ్యి 110 జరిమానా విధిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
రహదారి భద్రత, రోడ్ యాక్సిడెంట్ లను నివారించడానికి ఈ ఏడాది ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నామని సీపీ సజ్జనార్ ప్రకటించారు. ప్రమాదాలను గణనీయం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అందుకోసమే హైవే చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.