Home » మంత్రి తొక్కేస్తున్నారు, అధికారులు డోంట్ కేర్ అంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన
Published
2 months agoon
By
naveenmla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా ఫీలైపోతున్నారట. నేతల మధ్య వివాదాలను అధికారులు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని టాక్. చిట్టిబాబుకు రాజకీయ అనుభవం తక్కువ. అంతే మంత్రి విశ్వరూప్ ఆ నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టేశారని అంటున్నారు. దీంతో మంత్రి తీరుపై ఎమ్మెల్యే చిట్టిబాబు గుర్రుగా ఉన్నారు.
అధికారులు కూడా మంత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారు:
మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గానికి ఆనుకుని పి.గన్నవరం ఉండటంతో అధికారులు కూడా మంత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారట. మంత్రి ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే చిట్టిబాబు జీర్ణించుకోలేక పోతున్నారని అనుచరులు చెబుతున్నారు. తనను అసెంబ్లీకి పంపించిన అనుచరులకు, కార్యకర్తలకు అవసరమైన చిన్న చిన్న పనులు కూడా చేయలేక ఎమ్మెల్యే లోలోపల చాలా బాధపడిపోతున్నారని టాక్. ఇన్నాళ్లూ ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పుకుంటూ ఫీలైన చిట్టిబాబు.. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రజల ముందే బహిరంగంగా మంత్రి మీద విరుచుకుపడ్డారు. అధికార కార్యక్రమంలో మంత్రులను దుష్టశక్తులుగా సంబోధించి, తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే అవమానించారని వాలంటీర్ ఆత్మహత్యాయత్నం:
పి.గన్నవరం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ ఆధిపత్యం చలాయించడానికి ఎమ్మెల్యే చిట్టిబాబు వైఖరే కారణమని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలోనే ఇసుక అక్రమ రవాణా విషయంలో చిట్టిబాబుపై బహిరంగ ఆరోపణలు వినిపించాయి. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన వాలంటీర్ సువర్ణ ఆత్యహత్యాయత్నం ఘటన ప్రజల్లో కొంత సంచలనాన్ని రేపింది. నగరం గ్రామంలో జరగిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టిబాబు తనని అవమానించారంటూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇలాంటి సంఘటనలు ఉద్యోగుల పట్ల ఎమ్మెల్యేకు ఉన్న అసహనాన్ని బయటపెడుతోందని అంటున్నారు.
ఆధిపత్య పోరుని అడ్వాంటేజ్ గా తీసుకున్న అధికారులు:
ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని ప్రధాన ఇసుక ర్యాంపుల బాధ్యత పార్లమెంట్ ఇన్చార్జి తోట త్రిమూర్తులకు అప్పగించిన అధిష్టానం… పి.గన్నవరం నియోజకవర్గంపై ఓ లుక్ వేయాలని మంత్రి విశ్వరూప్‌కు అనధికారిక ఆదేశాలిచ్చిందని పార్టీ వర్గాల భోగట్టా. విశ్వరూప్, చిట్టిబాబుల ఆధిపత్య పోరును నియోజకవర్గంలో అధికారులు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న టాక్. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో అధికారులు చిట్టిబాబును అస్సలు పట్టించుకోవడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు.
భూసేకరణలో ఎమ్మెల్యేని సంప్రదించని అధికారులు:
మిగిలిన విషయాల మాట ఎలాగున్నా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల విషయంలో ఎమ్మెల్యేను అధికారులు అసలు సంప్రదించలేదట. భూములకు సంబంధించి జిల్లాలో ఆరు చోట్ల అవకతవకలు జరగ్గా ఒక్క పి.గన్నవరం నియోజకవర్గంలోనే మూడు చోట్ల జరిగాయని అంటున్నారు. ఎమ్మెల్యే చిట్టిబాబుకు తెలియకుండా అమలాపురం కేంద్రంగా ఈ మూడు వ్యవహారాలు చక్కబెట్టడంతో అటు ప్రభుత్వానికి, ఇటు ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చిందని చిట్టిబాబు వర్గం వాదన.
ఫిర్యాదు చేసే ధైర్యం లేక, ఎదురించలేక మౌనం:
రాజకీయాల్లో మంత్రి విశ్వరూప్, పరిపాలనలో అధికారులు ఆధిపత్యం చలాయిస్తూ తనను డమ్మీ ఎమ్మెల్యే చేశారని సన్నిహితుల దగ్గర చిట్టిబాబు వాపోతున్నారట. అధిష్టానానికి తన మీద ఆగ్రహం ఉండటంతో ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతున్నారని అంటున్నారు. ఇక ఇసుక లభ్యత అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన పి.గన్నవరంలో ఎక్కడా తన మాట చెల్లుబాటు కావడం లేదని లోలోన మధన పడిపోతున్నారు. మొత్తం మీద ఈ విషయాల్లో అధిష్టానానికి ఫిర్యాదు చేసే ధైర్యం లేక, మంత్రి విశ్వరూప్, పార్లమెంట్ ఇన్చార్జి తోట త్రిమూర్తుల ఆధిపత్యాన్ని ఎదిరించలేక చిట్టిబాబు మౌనంగా ఉండిపోతున్నారని అనుచరులు అంటున్నారు.