Home » భారత హై కమీషనర్ కు పాకిస్తాన్ సమన్లు
Published
1 year agoon
By
chvmurthyపాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను కాశ్మీర్ లోకి పంపించే ప్రయత్నాన్ని తిప్పి కొట్టే క్రమంలో భారత సైన్యం పీవోకే లోని ఉగ్రస్ధావరాలపై దాడులు చేసింది.
అయితే ఈ కాల్పుల్లో తంగ్ధర్ సెక్టార్లోని ఘుండిషాట్ గ్రామానికి చెందిన ముగ్గురు పౌరులు కూడా గాయపడ్డారు. భారతదేశం చేసిన ప్రతీకార కాల్పుల్లో, నియంత్రణ రేఖ వెంట ఐదుగురు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించినట్లు ఒక వార్తా సంస్ధ తెలిపింది. మంగళవారం సాయంత్రం పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ నుండి జరిపిన కాల్పుల్లో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది.
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఆగస్టులో తీసుకున్న నిర్ణయం తర్వాత, జమ్మూ కాశ్మీర్ లోగందరగోళం సృష్టించటానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెద్ద ఎత్తున భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పారు. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలు ఇంకా చురుకుగా పనిచేస్తూనే ఉన్నాయని పాకిస్తాన్ వారికి ఆయుధాలతో సహా అన్నిరకాల సహాయాన్ని అందిస్తోందని ఆర్మీ అన్నారు. ఇటీవల పంజాబ్ లో డ్రోన్ల సహాయంతో ఆయుధాలను పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు అందచేసిందని ఆర్మీ చెపుతోంది.