లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

టీడీపీకి పనబాక లక్ష్మి గుడ్ బై..? బీజేపీ కండువా కప్పుకుంటారా?

Published

on

panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీగా గెలవగా.. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు ఏపీలో గడ్డు పరిస్థితి ఎదురు కావడంతో అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడిపోయారు. అందులో భాగంగా 2019లో పనబాక లక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

బల్లి దుర్గా చేతిలో ఓటమి:
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయిన తిరుపతి పార్లమెంట్ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల దుర్గాప్రసాదరావు మృతి చెందడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. సీఎం జగన్ పాలనకు తిరుపతి పార్లమెంట్ ఉపపోరు రెఫరెండంగా కొందరు పేర్కొంటున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఈ స్థానం నుంచి నాలుగు ప్రధాన పార్టీలు పోటీ చేస్తాయని అంటున్నారు.

బరిలోకి వర్ల లేదా పనబాక:
సిటింగ్‌ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకొంటామనే ధీమాలో అధికార వైసీపీ ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని, పోటీ జరిగినా గెలుపు నల్లేరుపై నడకే అన్న ధీమా వైసీపీలో కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థిగా దుర్గాప్రసాదరావు తనయుడిని నిలబెట్టే చాన్స్‌ ఉందంటున్నారు. ఇక టీడీపీ కూడా తిరుపతి సీటుపై కన్నేసిందంటున్నారు. ఆ పార్టీ నుంచి ఇద్దరి పేర్లే ప్రధానంగా వినిపిస్తునాయి. వర్ల రామయ్య లేదా మళ్లీ పనబాక లక్ష్మి పోటీలో ఉంటారని ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ పోటీలో ఉంటారని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు.

బీజేపీలోకి పనబాక లక్ష్మి?
మరోపక్క, టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేస్తారని చెబుతున్నా.. ఆమె మాత్రం ఆసక్తి చూపించడం లేదంటున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని టాక్‌. తాను ఓడిపోయిన స్థానంలో మళ్లీ గెలవాలంటే టీడీపీ తరఫున పోటీ చేస్తే సాధ్యపడదని ఆమె భావిస్తున్నారట. రాష్ట్రంలో బీజేపీ, జనసేన యాక్టివ్‌గా పని చేస్తూ బలోపేతం అవుతున్న క్రమంలో పనబాక లక్ష్మి బీజేపీలో చేరి పోటీ చేయడమే కరెక్ట్ అని సన్నిహితులు అంటున్నారు. ఈ క్రమంలోనే సైకిల్‌ను వీడి కమలం గూటికి వెళ్లాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నందున ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నాయకులతో పనబాకకు పరిచయాలున్నాయి. దీంతో ఇప్పటికే ఆమె బీజేపీలో చేరికపై పలువురితో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. త్వరలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని అంటున్నారు.

బీజేపీకి మద్దతిచ్చే ఆలోచనలో టీడీపీ:
మరోపక్క, ఈ స్థానం నుంచి టీడీపీ కూడా పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతున్నా.. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు సందర్భంగా ఈ సీటును బీజేపీకి కేటాయించింది. దీంతో ఇప్పుడు కూడా అదే ఆలోచనలో టీడీపీ ఉందంటున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున పనబాక పోటీ చేస్తే.. లోపాయికారిగా మద్దతిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అధికార వైసీపీకి చెక్‌ చెప్పాలంటే ఇదే ఉత్తమమైన మార్గమని అంచనా వేస్తోందని చెబుతున్నారు.