విశ్లేషణ.. వైసీపీ, బీజేపీ కలిస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

pawan kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజులుగా ఎన్డీఏలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందట. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్‌ ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు చెబుతున్నారు. ఎన్డీఏకు వైసీపీ దగ్గరైతే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

తమకు మిత్రపక్షాలకు కొదవే లేదనే విషయాన్ని చెప్పాలని బీజేపీ ఆత్రుత:
ఎన్డీఏతో ఎప్పటి నుంచో కలసి సాగుతున్న శిరోమణి అకాలీదళ్‌ బయటకు వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త మిత్రులను చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. రాజకీయంగా ఏపీలో వైసీపీ బలమైన శక్తిగా ఉంది. అందుకే వైసీపీపి చేర్చుకోవటం ద్వారా తమకు మిత్రపక్షాలకు కొదవే లేదనే విషయాన్ని బీజేపీ ఇతర పార్టీలకు చెప్పాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ, బీజేపీ కలిస్తే పవన్ పరిస్థితేంటి?
రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే ఎన్డీఏలో వైసీపీ చేరితే ప్రస్తుతం ఏపీ నుంచి బీజేపీతో దోస్తీ చేస్తున్న జనసేన పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. వైసీపీ, బీజేపీ కలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో చెలిమి చేసిన పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వనందుకు దూరమవుతున్నామని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. హోదా విషయాన్ని పక్కన పెట్టేసి అమరావతి కోసమేనంటూ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు.

పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
అమరావతి విషయంలో కేంద్రం పాత్రేమీ లేదని బీజేపీ తేల్చేస్తోంది. అయినా దీనిపై ఇంత వరకూ పవన్‌ కల్యాణ్‌ స్పందించ లేదు. ప్రత్యేక హోదా విషయంలో విభేదించి బయటకు వచ్చానని చెప్పుకున్న పవన్ కల్యాణ్ అంత తొందరగా బీజేపీతో కలవడం రాజకీయ వర్గాల్లో విమర్శలు ఎదురయ్యాయి. అయినా కలసి సాగేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఎన్డీఏలో వైసీపీ చేరుతుందన్న వార్తల నేపథ్యంలో పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారా?
పవన్‌ కల్యాణ్‌ తొలి నుంచి వైసీపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను విమర్శిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీయేలో చేరితే పవన్‌ బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తారా? అన్న అనుమానాలున్నాయి. బలంగా ఉన్న వైసీపీని బీజేపీ అక్కున చేర్చుకుంటే ఏపీలో ఆ పార్టీకి ప్రయోజనం ఉంటుందా? వైసీపీ సర్కారుపై ఇన్నాళ్లూ విమర్శలు గుప్పించిన రాష్ట్ర బీజేపీ నేతలు.. ఈ పరిస్థితులను ఆహ్వానించగలుగుతారా? పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో మరోసారి తెగదెంపులు చేసుకుంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Related Tags :

Related Posts :